● వ్యాధి దమన్ పేరుతో సబ్ డివిజనల్ ఆరోగ్య కేంద్రం నిర్వహణ
● 500 మందికి వైద్య పరీక్షలు
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ సమితి కేంద్రంలో వ్యాధి దమాన్ పేరిట నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని అనూహ్య స్పందన లభించింది. 500 మందికి డాక్టర్లు వైద్య సేవలు అందించి మందులు సరఫరా చేశారు. చిత్రకొండ సమితి వైద్య సేవలకు దూరంగా ఉంటుంది. మారుమూల స్వానిమాన్ అంచల్ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో చిత్రకొండ సబ్ డివిజనల్ ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో బహుళ వైద్య విభాగాలతో శిబిరాన్ని నిర్వహించారు. అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా సహకారంతో నిర్వహించిన శిబిరానికి వ్యాధి దమన్ అని పేరు పెట్టారు. నిపుణులైన వైద్యులు హాజరై రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించారు. కటక్, బుర్లా, కోరాపుట్, బ్రహ్మపూర్, మల్కన్‌గిరి తదితర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రముఖ వైద్యులు రోగులను పరీక్షించి అవసరమైన వైద్య సలహాలు అందించారు. కిమ్స్ డైరెక్టర్ డాక్టర్ లలిత్ మోహర్, కటక్‌కు చెందిన వైద్య నిపుణులు డాక్టర్ జయంత్ పండా, డాక్టర్ రంజారన్ సేన్, కోరాపుట్‌కు చెందిన విభాగాధిపతి డాక్టర్ నమితా మహంతి, బ్రహ్మపూర్‌కు చెందిన డాక్టర్ సరితా బెహరా, బుర్లాకు చెందిన గుండె వైద్య నిపుణుడు డాక్టర్ విక్రమాదిత్య పాడీ, జీర్ణకోశ వైద్యులు డాక్టర్ భువన్ పండా, నరాల వ్యాధుల నిపుణులు కుమార్ విశ్వమయ్, కిడ్నీ వ్యాధుల వైద్యుడు దీపక్ పాణిగ్రాహి, మల్కన్‌గిరికి చెందిన వైద్యులు కృష్ణచంద్ర మాహపాత్రో, డాక్టర్ దేవాశిష్ పండా, డాక్టర్ క్షీరోధ చంద్ర మహంతి, డాక్టర్ ప్రేమచంద్ ప్రధాన్, జిల్లా ఎస్పీ వినోద్ పటేల్, జిల్లా అటవీశాఖ అధికారి సాయికిరణ్ డిఎస్ హాజరయ్యారు. ఈ ప్రాంతంలో ఎవరికి ఎటువంటి వైద్యం అవసరమైన విశాఖపట్నం లేదా బ్రహ్మపూర్‌కు వెళ్లాల్సి వస్తుంది. కొంతమంది గిరిజనులైతే ఇక్కడే వుండి ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారు. ఈ పరిస్థితిలో ఇలాంటి వైద్య శిబిరాలు అవసరమని వైద్యులు పేర్కొన్నారు. ఇకపై ఎలాంటి వైద్య సేవలు అవసరమైన తమకు ఫోన్ ద్వారా సమాచారం ఇస్తే తక్షణమే స్పందించి మందులను అందిస్తామని పేర్కొన్నారు. భవిష్యత్‌లో కూడా ఈ ప్రాంతాంలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా వైద్యులను సత్కరించి గౌరవించారు.


