పర్లాకిమిడి : గజపతి జిల్లా కాశీనగర్ బ్లాక్లో పనిచేస్తున్న అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ మానసకుమార్ సాహు పేద భవన కార్మికుల కుటుంబాలకు పథకాలు అందకుండా చేస్తున్నారని, మెటర్నిటీ, వివాహ, మృత్యువాత పడిన కార్మికుల కుటుంబాల దరఖాస్తులు బుట్టదాఖలు చేస్తూ నిర్లక్ష్యం విహిస్తున్నారని, ఆయన్ను వెంటనే బదిలీ చేయాలని ఒడిషా భీం ఆర్మీ అధ్యక్షుడు అసలాం నాయక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఆయనకు మద్దతుగా ఒడిషా మాజీ చీఫ్ సెక్రటరీ, పర్లాకిమిడి కాంగ్రెస్ మాజీ ప్రచార కమిటీ సభ్యులు బిజయ కుమార్ పట్నాయిక్ నిలిచారు. ఈ సందర్భంగా నాయక్ మాట్లాడుతూ కోట్లాది రూపాయలను బిల్డింగ్, నిర్మాణ కార్మికుల గుత్తేదారులు సెస్ రూపంలో ప్రభుత్వానికి డబ్బులు కడుతున్నారని, అయితే కాశీనగర్ బ్లాక్లో పనిచేస్తున్న అసిస్టెంట లేబర్ ఆఫీసర్ మానస కుమార్ సాహు పేద భవననిర్మాణ కుటుంబాలకు న్యాయంగా అందాల్సిన మ్యారేజ్ బెనిఫిట్, వారి పిల్లలకు చదట్వు నిమిత్తం ప్రభుత్వం అందిస్తున్న పథకాలు అందకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. మరణం తర్వాత కార్మిక కుటుంబాలకు అందాల్సిన ఆర్థిక సహాయం, మెటర్నీటీ, ఇతర పథకాలు అందకుండా చేస్తున్నారని మండిపడ్డారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఆందోళనలో కాశీనగర్, పర్లాకిమిడికి చెందిన అనేక మంది కార్మికులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పథకాలు అందకుండా చేస్తున్నారు
అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ సాహును బదిలీ చేయాలి
కలెక్టరేట్ ఎదుట ఒడిషా భీం ఆర్మీ అధ్యక్షుడు నాయక్ ధర్నా
మద్దతుగా నిలిచిన మాజీ చీఫ్ సెక్రటరీ బిజయకుమార్ పట్నాయిక్


