కొరాపుట్: అయ్యప్ప దీక్షలతో స్నేహపూర్వక సమాజం నిర్మితమవుతుందని వైఎస్సార్సీపీ ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర మూర్తి అన్నారు. ఆంధ్రా – ఒడిశా సరిహద్దు కొరాపుట్ జిల్లా నందపూర్ సమితి బిల్లాపుట్ గ్రామ పంచాయతీ జోలాపుట్ (ఆర్ఎఫ్) గ్రామానికి ఆనుకొని ఉన్న జోలాపుట్ (ఎల్ఎఫ్) గ్రామంలో మంగళవారం అయ్యప్ప సన్నిధానం ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన పదవీ కాలంలో ఈ భవన నిర్మాణం కోసం రూ.20 లక్షల జెడ్పీ నిధులు, రూ.5 లక్షల మండల పరిషత్ నిధులు సమకూర్చిన విషయం గుర్తు చేశారు. ప్రతీ ఏడాది జోలాపుట్ ప్రాంతంలో రక్తం గడ్డ కట్టించే చలిలో కూడా భారీ సంఖ్యలో అయ్యప్ప మాలలు వేస్తున్నారన్నారు. యువతలో ఇటువంటి భక్తినిరతి రావడంపై హర్షం వ్యక్తం చేశారు. బీజేడీ పార్టీకి చెందిన కొరాపుట్ సెంట్రల్ కో–ఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షుడు ఈశ్వర్ చంద్ర పాణిగ్రాహి మాట్లాడుతూ జోలాపుట్ ప్రాంత యువత గుప్తేశ్వరంలో ప్రతి ఏడాది భోల్బం యాత్రికులకు ఉచిత ఆహారం పంపిణీ చేయడంపై అభినందించారు.
ఇబ్బందులు తొలిగాయి
అఖిల భారత అయ్యప్ప చిన్ముద్ర సేవా ట్రస్ట్ ఒడిశా విభాగ అధ్యక్షుడు పొడుగు గుప్తేశ్వరరావు మాట్లాడుతూ జోలాపుట్లో ప్రతి ఏడాది భారీ సంఖ్యలో యువత అయ్యప్ప మాలలు వేస్తున్నారన్నారు. ఇదివరకు సరైన సన్నిధానం లేక ఇబ్బందులు పడేవారమన్నారు. కానీ సుభద్ర చొరవతో తమకు భారీ శాశ్వత భవనం నిర్మితమై ఇబ్బందులు తొలిగాయని హర్షం వ్యక్తం చేశారు. అంతకుముందు భారీ సంఖ్యలో యువత అయ్యప్ప తొలి మండల దీక్ష కోసం మాలాధారణ చేశారు. కార్యక్రమంలో జోలాపుట్ (ఎల్ఎఫ్) మాజీ సర్పంచ్ వంతల నీలకంఠం, జిల్లా జేసీఎస్ కో–ఆర్డినేటర్ జగబందు, ఎండీ సులేమన్, వైఎస్సార్సీపీ ముంచంగిపుట్ మండల ప్రెసిడెంట్ పద్మారెడ్డి, వైశ్యరాజు ఉదయ్ కుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు.


