భువనేశ్వర్: గజపతి జిల్లాలోని పర్లాకిమిడి ప్రాంతం సమగ్ర అభివృద్ధికి హైటెక్ గ్రూప్ ఎల్లప్పుడూ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుందని వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి అన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కనక్ వర్ధన్ సింగ్దేవ్ని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంగా ఈ ప్రకటన చేశారు. పర్లాకిమిడి ప్రాంతంలో వ్యవసాయం, రైతుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం దిశలో ప్రభుత్వ కార్యాచరణను ప్రసంశించారు. పరిసర గ్రామీణ ప్రాంతాలలో విద్యుదీకరణ, ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజన కింద సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు ప్రాంతీయులకు లబ్ధి చేకూర్చుతుందన్నారు. పర్లాకిమిడి కేంద్రంగా గజపతి జిల్లా రాష్ట్ర హరిత విప్లవంలో ముందంజలో ఉంటుందని ఉప ముఖ్యమంత్రికి వివరించారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో వ్యవసాయ, విద్యా, ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం నిరంతర సహకారం అత్యంత అవసరమని అభ్యర్థించారు.


