● ఏబీడీహెచ్ఏ తరహాలో మరో కార్యక్రమానికి యోచన
● నిర్దేశిత వ్యవధిలో పనులు పూర్తి చేయాలి: సీఎం మాఝీ
భువనేశ్వర్: పూరీ అభివృద్ధికి ఏబీడీహెచ్ఏ తరహాలో కొత్త పథకాన్ని ప్రారంభించేందుకు ఒడిశా ప్రభుత్వం యోచిస్తోంది. మరోవైపు, నగరంలో కొనసాగుతున్న మౌలిక సదుపాయాలు, వారసత్వ పరిరక్షణ, పర్యాటక ప్రాజెక్టులను గడువులోగా పూర్తి చేయాలని సీఎం మోహన్ చరణ్ మాఝీ అధికారులను ఆదేశించారు. శ్రీ జగన్నాథ స్వామి కొలువైన పూరీ పుణ్యక్షేత్రాన్ని ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక, వారసత్వ, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఒడిశా ప్రభుత్వం చర్యలను వేగవంతం చేస్తోంది. నగరంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆలయ వారసత్వ పరిరక్షణ, యాత్రికులకు మెరుగైన వసతుల కల్పనతో పాటు జగన్నాథ సంస్కృతి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా గత ప్రభుత్వం అమలు చేసిన ప్రాథమిక సౌకర్యాల పెంపు, వారసత్వ, వాస్తుశిల్ప అభివృద్ధి (ఏబీడీహెచ్ఏ) పథకం తరహాలో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించాలని యోచిస్తున్నట్లు రాష్ట్ర న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ వెల్లడించారు.
జగన్నాథ సంస్కృతి,
వారసత్వానికి ప్రాధాన్యం..
ప్రతిపాదిత కార్యక్రమం కింద పూరీ అభివృద్ధికి సంబంధించిన భవిష్యత్ ప్రాజెక్టులన్నింటినీ సమగ్రంగా చేపట్టే ఆలోచన ఉందని మంత్రి తెలిపారు. జగన్నాథుని ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాధాన్యాన్ని మరింతగా చాటిచెప్పడంతో పాటు, భక్తులకు అవసరమైన సౌకర్యాలను మెరుగుపరచడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. యాత్రికులకు సౌకర్యవంతమైన అనుభూతిని అందిస్తూ, పూరీ నగర సౌందర్యాన్ని, చారిత్రక వైభవాన్ని పరిరక్షించే దిశగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. 12వ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ శ్రీ జగన్నాథ ఆలయానికి నిలయమైన పూరీని ప్రపంచ స్థాయి వారసత్వ, ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో 2017–18 ఆర్థిక సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ఏబీడీహెచ్ఏ పథకాన్ని ప్రారంభించింది. ఇప్పుడు అదే తరహాలో కొత్త కార్యక్రమాన్ని రూపొందించడం ద్వారా నగర అభివృద్ధి పనులకు మరింత సమగ్ర రూపం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది.
జాప్యాన్ని సహించం: సీఎం
పూరీలో కొనసాగుతున్న కీలక మౌలిక సదుపాయాలు, వారసత్వ పరిరక్షణ, పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ అధికారులను ఆదేశించారు. పనుల అమలులో నిర్లక్ష్యం, అనవసర జాప్యాన్ని సహించబోమని స్పష్టం చేశారు. పూరీని అంతర్జాతీయ స్థాయి వారసత్వ, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చేపట్టిన వివిధ ప్రాజెక్టుల పురోగతిని ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఒఠొరొనొలా సమీపంలోని వారసత్వ వంతెన పునర్నిర్మాణం, అన్నపూర్ణ థియేటర్ పునరాభివృద్ధి, పూరీ బీచ్ సుందరీకరణ, స్వర్గద్వార్ సమగ్ర అభివృద్ధి పనులపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. వీటితో పాటు సంధ్యా హారతి కార్యక్రమం, జగన్నాథుని సాగర విజే ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను కూడా సమీక్షించారు.
క్షేత్రస్థాయిలో పర్యవేక్షణకు ఆదేశాలు..
ప్రాజెక్టుల అమలును శాఖల వారీగా సమన్వయం చేసుకుంటూ, అధికారులు క్షేత్రస్థాయిలో పనులను స్వయంగా పర్యవేక్షించాలని సీఎం సూచించారు. నిర్ణీత కాలపరిమితిలో పనులు పూర్తయ్యేలా శాఖాధికారులు, జిల్లా కలెక్టర్లు, పోలీసు సూపరింటెండెంట్లు సమష్టిగా కృషి చేయాలని ఆదేశించారు. అభివృద్ధి కార్యక్రమాలు కేవలం నిర్మాణాలకే పరిమితం కాకుండా పూరీ ప్రజలకు సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక ప్రయోజనాలను అందించాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వారసత్వ సంపద పరిరక్షణ, పర్యాటక సదుపాయాల విస్తరణ, స్థానిక ప్రజల జీవనోపాధికి ఊతమిచ్చేలా ప్రాజెక్టుల అమలుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. కొత్త అభివృద్ధి కార్యక్రమంపై ప్రభుత్వ ఆలోచనలు, ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి సమీక్ష పూరీని ఆధ్యాత్మిక వైభవం, చారిత్రక వారసత్వం, ఆధునిక మౌలిక సదుపాయాల సమ్మేళనంగా తీర్చిదిద్దాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి.


