విద్యార్థి సంఘం ఎంపికపై వివాదం | - | Sakshi
Sakshi News home page

విద్యార్థి సంఘం ఎంపికపై వివాదం

Oct 14 2026 4:11 AM | Updated on Oct 14 2026 4:11 AM

● బిసంకటక్‌ కళాశాలో పరిస్థితి

● పోలీసు, అధికారుల చర్చలు విఫలం

రాయగడ: జిల్లాలోని బిసంకటక్‌ ఉన్న మా మార్కమా డిగ్రీ కళాశాలలో విద్యార్థి సంఘం ప్రతినిధుల ఎంపిక వివాదాస్పదంగా మారింది. ఈ నెల 9వ తేదీన నిర్వహించిన ఎంపిక ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న విద్యార్థులు ఆ ప్రక్రియను రద్దు చేసి ప్రజా స్వామ్య పద్ధతిలో తిరిగి ఎన్నిక నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ వివాదంపై పోలీసు, కళాశాల అధికారుల సమక్షంలో మంగళవారం జరిగిన చర్చలు ఎలాంటి నిర్ణయం లేకుండానే ముగిశాయి. విద్యార్థుల ఆరోపణల ప్రకారం.. ప్రతినిధుల ఎంపికకు ముందు కళాశాల నోటీసు బోర్డులో ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఓటర్ల జాబితా, నామినేషన్‌ ప్రక్రియను అనుసరించకుండా డిపార్ట్‌మెంట్‌ రిప్రజెంటీటీవ్‌ (డీఆర్‌)ను ఎంపిక చేశారని వారు పేర్కొన్నారు. అంతేకాకుండా ఖాళీ కాగితాలపై విద్యార్థుల సంతకాలు తీసుకున్నారని ఆరోపించారు. ఎంపిక ప్రక్రియలో పారదర్శకత పాటించలేదని, తక్షణమే దానిని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

మూడేళ్లుగా వార్షికోత్సవాలు, క్రీడలు లేవు

కళాశాలలో మూడేళ్లుగా వార్షిక క్రీడోత్సవాలు, వార్షికోత్సవాలు నిర్వహించడంపైనా విద్యార్థులు ప్రశ్నలు లేవనెత్తారు. కార్యక్రమాల కోసం కేటాయించిన నిధులను ఎలా ఖర్చు చేశారో బహిర్గతం చేయాలని అనే అంశంపై ప్రశ్నలు తలెత్తకుండా చేసేందుకే కళాశాల ప్రిన్సిపాల్‌ ఏకపక్షంగా ప్రతినిధులను ఎంపిక చేశారని విద్యార్థులు తమ ఫిర్యాదులో ఆరోపించారు.

కొలిక్కిరాని వివాదం

పరిస్థితిని చక్కదిద్దేందుకు అదనపు ఎస్పీ సత్యప్రకాష్‌ నందా, బిసంకటక్‌ ఎస్‌డీపీవో సంతోషిని ఒరం, కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ అశ్విని కుమార్‌ పండ, విద్యార్థి ప్రతినిధుల మధ్య సుధీర్ఘంగా చర్చలు జరిగినప్పటికీ ఎలాంటి పరిష్కారం లభించలేదు. విద్యార్థులు తమ డిమాండ్లపై వెనక్కి తగ్గకుండా జిల్లా కలెక్టర్‌, సబ్‌ కలెక్టర్‌, తహసీల్దార్‌, ఉన్నత విద్యాశాఖ డైరెక్టర్‌, ముఖ్యమంత్రి కార్యాలయానికి వినతిపత్రాల ప్రతులను పంపించారు. డిమాండ్లను నెరవేర్చకపొతే కళాశాల ప్రధాన గేటును మూసివేసి శాంతియుత ధర్నా చేపడతామని హెచ్చరించారు.

ఆందోళనకు దిగితే

చర్యలు: సబ్‌కలెక్టర్‌ హెచ్చరిక

ఈ వివాదంపై గుణుపూర్‌ సబ్‌కలెక్టర్‌ దుదూల్‌ అభిషేక్‌ దిల్లిప్‌ స్పందిస్తూ ఘటనపై విచారణ కొనసాగుతోందని.. నేరం రుజువైత చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపినట్లు సమాచారం. విద్యార్థులను ఎవరైనా రెచ్చగొట్టడం, లేదా కళాశాలకు తాళం వేసి ఎన్నికల ప్రక్రియను ఆటంకం కలిగించడం వంటి ఘటనలు జరిగితే అలాంటి వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు కేసు నమోదు చేస్తామని మీడియాకు తెలిపారు.

రాజకీయరంగు పులుముకుంటున్న వివాదం

కళాశాలలో ఎంపికై న విద్యార్థులు బిజూ ఛత్రజనతాదళ్‌కు చెందిన వారనే చర్చ సాగుతొంది. మరోవైపు విద్యార్థి సంఘం ప్రతినిధులను తిరిగి ఎంపిక చేయాలని డిమాండ్‌ చేస్తున్న వారిలో ఏబీవీపీకి చెందిన విద్యార్థు ఉన్నారనే ప్రచారం కూడా ఊపందుకుంది. ఈ నేపథ్యంలో వివాదం రాజకీయ మలుపు తిరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement