● ప్రజా సమస్యలపై వార్తల సేకరణకు అడ్డంకులు
● ఎస్పీకి ఫిర్యాదు చేసిన ప్రెస్ అండ్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు
రాయగడ: ప్రజా సమస్యలు, ప్రభుత్వ పనుల్లో అవకతవకలపై వార్తలు ప్రచురిస్తున్న జర్నలిస్టులను బెదిరించడం, వార్త సేకరణకు అడ్డంకులు సృష్టించడం, వారి భద్రతకు ముప్పు కలిగించడం వంటి ఘటనలపై రాయగడలో ఆందోళన వ్యక్తమైంది. ఈ ఘటనలపై నిష్పక్షపాత విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్రెస్ అండ్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ రాయగడ శాఖ ప్రతినిధులు జిల్లా ఎస్పీకి వినతిపత్రం సమర్పించారు. అదనపు ఎస్పీ గొసానార్ బర్లాకు వినతిపత్రాన్ని అందించారు. అనంతరం జర్నలిస్టులు రాయగడ మున్సిపాలిటీ కార్యాలయానికి వెళ్లి ఎగ్జిక్యూటివ్ అధికారి కులదీప్ కుమార్కు మరో వినతిపత్రం అందజేశారు.
డంపింగ్ యార్డు వ్యవహారంపై బెదిరింపులు
ఈ నెల 9ని ఒడియా దినపత్రిక సంబాద్లో రాయగడ మున్సిపాలిటీ పరిధిలోని చెత్త డంపింగ్ యార్డులో జరుగుతున్న పనులు, అక్కడి అక్రమాలపై వార్త ప్రచురితమైంది. చెత్తను సరైన పద్ధతిలో ప్రాసెసింగ్ చేయకుండా మరో ప్రాంతానికి తరలిస్తున్నారనే అంశాన్ని ఆ కథనంలో ప్రస్తావించారు. అంతకుముందు డంపింగ్ యార్డులో అగ్నిప్రమాదం జరిగి చెత్త దగ్ధమైన ఘటనపై జర్నలిస్టు కె.శివప్రసాద్ దొర వార్త రాశారు. ఈ నేపథ్యంలో సంబంధిత ప్రాజెక్టు కాంట్రాక్టర్ జర్నలిస్టులను బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రెస్ అండ్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధి శివాజీ దాస్, సభ్యులు శివనారాయణ గౌడొ, శివ ప్రసాద్ దొర, నందొ, ప్రశాంత్ పాలొ, నిరంజన్ పాలొ, స్మృతి రంజన్ మహాంతి, సంతొష్ కుమార్ దలాయి, సుభాష్ సూర్య, సురేష్ దాస్, మురళి బొచ్చ, సీహెచ్ శ్రీనివాస్, వై.దామోదర్, మనొజ్ సతపతి తదితరులు పాల్గొన్నారు.


