పరిహారాన్ని వసూలు చేస్తాం | - | Sakshi
Sakshi News home page

పరిహారాన్ని వసూలు చేస్తాం

Oct 13 2026 1:11 AM | Updated on Oct 13 2026 1:11 AM

పరిహారాన్ని వసూలు చేస్తాం

కొరాపుట్‌: నబరంగ్‌పూర్‌ జిల్లాలో కృత్రిమ వరదకు కారణమైన ఒడిశా హైడ్రో పవర్‌ కార్పొరేషన్‌ నుంచి వరద బాధితులకు పరిహారాన్ని ముక్కు పిండి వసూలు చేస్తామని ప్రతిపక్ష బీజేడీ హెచ్చరించింది. సోమవారం నబరంగ్‌పూర్‌ జిల్లా కేంద్రంలో బినోద్‌ ప్యాలెస్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆ పార్టీ జాతీయ స్పోక్స్‌ పర్సన్‌, మాజీ ఎంపీ ప్రసంగించారు. గత నెల 26న జిల్లాకి ముంచెత్తిన వరదల వలన నబరంగ్‌పూర్‌ పట్టణం, నందాహండి, తదితర ప్రాంతాలు మునిగిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. 23వ తేదీకే భారీ వర్షం ఉందనే సమాచారం అధికారులకు ఉందన్నారు. ముందస్తుగా ఎటువంటి చర్యలు చేపట్టలేదరన్నారు. అర్ధరాత్రి ఇంద్రావతి, మురాన్‌ రిజర్వాయర్లకి చెందిన మొత్తం 5 గేట్లు ఎత్తి వేశారన్నారు. దీంతో ఈ వైపరీత్యం వచ్చిందన్నారు. ముందుగా ప్రజలను తరలించడం, ఒడ్రాఫ్‌ని సిద్ధం చేయడం, బోట్లు రప్పించడం వంటి పనులు చేయలేదన్నారు. సుమారు 40 వేల మంది ప్రజలు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఓహెచ్‌పీసీ ఇంద్రావతి జ్రాజెక్ట్‌లో విద్యుత్‌ ఉత్పత్తి చేయడం వలన రోజుకు రూ.5.5 కోట్ల నుంచి రూ.8 కోట్ల లాభం ఆర్జిస్తుందని ఆధారాలతో వివరించారు. వరద బాధితుల కోసం ప్రభుత్వం కేవలం రూ.5 కోట్లు మాత్రమే విడుదల చేసిందన్నారు. కనీసం ఒక్క రోజుకు వచ్చిన లాభం కూడా బాధితులకు ఇవ్వలేదన్నారు. నబరంగ్‌పూర్‌ పట్టణంలో మూడు వార్డులు మునిగిపోతే ఇంతవరకు ఒక ప్రభుత్వ అధికారి పరామర్శించలేదన్నారు. జిల్లాలో 20 నుంచి 25 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నా.. ఒక్కరు కూడా నేటివరకు పట్టణంలోని ఒక్క బాధితుడి నివాసాకి కూడా రాకపోవడం ప్రభుత్వ చేతకానితనం అన్నారు.

వరద బాధితులను పరామర్శించని సీఎం..

ముఖ్యమంత్రి మెహన్‌చరణ్‌.. మండయ్‌ ఉత్సవానికి వచ్చి గంటన్నర సమయం ప్రసంగించారన్నారు. కానీ వరద ప్రాంతానికి రాలేకపోయారన్నారు. కనీసం జిల్లాలో ఒక్క గ్రామాన్ని కూడా సీఎం సందర్శించక పోవడం బీజేపీ నేతలు చేతకానితనమని దుయ్యబెట్టారు. జిల్లా మంత్రి నిత్యానంద గొండో, ఎంపీ బలబద్ర మజ్జి, ఎమ్మెల్యే గౌరీ శంకర్‌ మజ్జిలు సీఎంను తేలేకపోవడం అవమానకరమన్నారు. నేటికీ జిల్లాలో బాధితులకు కేవలం 15 కేజీల బియ్యం మాత్రమే పరిహారం ఇచ్చారన్నారు. ఇంత కన్నా చేతకాని ప్రభుత్వం లేదన్నారు. నబరంగ్‌పూర్‌ పట్టణంలో ఎస్‌ఎన్‌ వరల్డ్‌ షాపులో రూ.3 కోట్ల నష్టం జరిగిందన్నారు. ఒక్క షాపులోనే ఇంత నష్టం జరిగితే జిల్లాలో మరెంత నష్టం జరిగిందో ఆలోచించాలన్నారు. సీఎంతో పాటు రాష్ట్రమంత్రి కనక వర్ధన్‌ సింగ్‌ దేవ్‌ కూడా వారి బాధ్యతల నుంచి తప్పించుకోలేరన్నారు. పంటలు, ఇళ్లు, తిండి సామగ్రి, వస్తువులు, దుస్తులు, వాహనాలు ఇలా ఎన్నో వస్తువులు ప్రజలు కోల్పోయారన్నారు. వీటన్నిటి కోసం బీజేడి పార్టీ పోరాటం చేస్తుందన్నారు. వరద బాధితులు నష్టాలకు సంబంధించిన పూర్తి వివరాలు అందజేయాలన్నారు. వరద వచ్చిన 8 గంటల తర్వాత రాయగడ, కలహండి జిల్లాల నుంచి పడవలు తెప్పించిన విషయం గుర్తుచేశారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, డాబుగాం ఎమ్మెల్యే మనోహర్‌ రంధారి, మాజీ ఎమ్మెల్యే సదాశివ ప్రధాని, మాజీ జెడ్పీ ప్రెసిడెంట్‌ మంజులా మజ్జి, బీజేడీ నాయకులు జోగేశ్వర్‌ స్వయ్‌, రబి పట్నాయక్‌, అరుణ్‌ మిశ్ర, తపస్‌ త్రిపాఠి, ప్రమెద్‌ త్రిపాఠి, భీమె పూజరి, కేశవ రాజు, తదితరులు ప్రసంగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement