టికెట్టు తీసుకుంటుండగా కుప్పకూలిన మహిళ
ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి
రాయగడ: స్థానిక రైల్వే స్టేషన్లో టికెట్ కొనుగోలు చేస్తున్న సమయంలో ఓ మహిళ అస్వస్థతకు గురై కుప్పకూలింది. వెంటనే ఆమెను ఆంబులెన్స్లో జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలిస్తుండగా గుండెపోటు రావడంతో మృతి చెందింది. ఈ విషాద ఘటన సోమవారం చోటు చేసుకుంది. సదరు సమితి పరిధిలోని మల్లిగాం గ్రామానికి చెందిన డి.సరస్వతి (65) తన కూమార్తెను అత్తారింట్లో విడిచిపెట్టేందు కు ఆంధ్రప్రదేశ్లోని బొబ్బిలికి వెళ్లాలని సోమవా రం ఉదయం బయలుదేరింది. ఈ క్రమంలో రాయగడ రైల్వే స్టేషన్లో టికెట్ కొనుగోలు చేస్తుండగా తల తిరిగి కిందపడిపోయింది. బీపీ తగ్గడంతో అస్వస్థతకు గురైనట్లు సమాచారం. అదే సమయంలో అక్కడ ఉన్న జర్నలిస్ట్ కె.కృష్ణమూర్తి పట్నాయక్ వెంటనే స్పందించి అంబులెన్స్కు సమాచారం అందించారు. అంబులెన్స్ సిబ్బంది స్టేషన్కు చేరుకుని మహిళకు ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం జిల్లా హాస్పిటల్కు తరలిస్తుంగా గుండెపోటు వచ్చినట్లు సమాచారం. వైద్యులు పరీక్షించినప్పటికే అప్పటికే ఆమె మృతి చెందినట్లు ధ్రువీకరించారు. కుమార్తెను అత్తవారింటికి పంపించేందు కు ప్రయాణానికి సిద్ధమైన సరస్వతి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.


