డ్రోన్‌ నిఘా విస్తరణ | - | Sakshi
Sakshi News home page

డ్రోన్‌ నిఘా విస్తరణ

Oct 12 2026 8:34 AM | Updated on Oct 12 2026 8:34 AM

న్యూస్‌రీల్‌

2027 మార్చి నాటికి 22 డ్రోన్లు

284 స్టేషన్లలో భద్రతా పర్యవేక్షణ

సోమవారం శ్రీ 12 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026
తూర్పు కోస్తా రైల్వేలో..

భువనేశ్వర్‌: డ్రోన్‌ నిఘాలో తూర్పు కోస్తా రైల్వే భారతీయ రైల్వేల్లో అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుతం 11 డ్రోన్లతో మూడు డివిజన్ల పరిధిలోని 284 స్టేషన్లు, 2,708 రూట్‌ కిలోమీటర్ల మేర నిఘా నిర్వహిస్తోంది. రైల్వే భద్రత, ప్రయాణికుల రక్షణను మరింత బలోపేతం చేసేందుకు 2027 మార్చి నాటికి డ్రోన్ల సంఖ్యను 22కు పెంచాలని నిర్ణయించింది.

‘డ్రోఆక్‌ ఐ’తో నిరంతర నిఘా

‘డ్రోఆక్‌ ఐ–పరిశీలన, గుర్తింపు, నివారణ’ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమం రైల్వే రక్షక దళం (ఆర్‌పీఎఫ్‌) భద్రతా విధులకు మరింత బలాన్నిస్తోంది. అనుమానాస్పద కదలికలను గుర్తించడం, నేరాలను అరికట్టడం, సున్నిత ప్రాంతాల్లో నిఘా పెంచడం, రైల్వే ఆస్తులను పరిరక్షించడం దీని ప్రధాన లక్ష్యాలుగా రైల్వే శాఖ పేర్కొంది. ప్రస్తుతం ఖుర్దా రోడ్‌ మండలంలో నాలుగు, సంబల్‌పూర్‌లో ఆరు, రాయగడ మండలంలో ఒక డ్రోన్‌ను వినియోగిస్తున్నారు. వీటి నిర్వహణకు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) ధ్రువీకరణ పొందిన 160 మంది డ్రోన్‌ పైలట్లు సహకరిస్తున్నారు. మొత్తం 31 ఆర్‌పీఎఫ్‌ పోస్టుల పరిధిలో ఈ నిఘా వ్యవస్థ పనిచేస్తోంది.

తొమ్మిది నెలల్లో 3,033 డ్రోన్‌ గస్తీలు

ఈ ఏడాది జనవరి 1 నుంచి సెప్టెంబర్‌ 15 వరకు తూర్పు కోస్తా రైల్వే ఆర్‌పీఎఫ్‌ మొత్తం 3,033 డ్రోన్‌ గస్తీలు నిర్వహించింది. వీటిలో ఖుర్దా రోడ్‌ మండలంలో 680, రాయగడలో 1,024, సంబల్‌పూర్‌లో 1,329 గస్తీలు చేపట్టారు. వీటిలో 1,265 రెడ్‌ కోడ్‌ గస్తీలు అత్యంత కీలకమైన భద్రతా కార్యకలాపాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాయి. రైల్వే మార్గాలను ధ్వంసం చేసే కుట్రలను అడ్డుకోవడం, రైళ్లపై రాళ్లు రువ్వే ఘటనలను నివారించడం, కేబుళ్ల చోరీలను గుర్తించడం, అగ్నిప్రమాదాలపై నిఘా ఉంచడం వంటి కార్యకలాపాలకు ఈ గస్తీలు ఉపయోగపడ్డాయి.

మారుమూల ప్రాంతాల్లోనూ పర్యవేక్షణ

నైట్‌ విజన్‌, థర్మల్‌ కెమెరాలతో కూడిన డ్రోన్లు అటవీ ప్రాంతాలు, కొండ మార్గాలు, సొరంగాలు, వంతెనలు, జనసంచారం తక్కువగా ఉండే రైల్వే మార్గాల్లో నిఘాకు ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా కొరాపుట్‌ – రాయగడ–కిరండోల్‌ మార్గంలోని కష్టతరమైన ప్రాంతాల్లో వీటి సేవలు కీలకంగా మారాయి. రైల్వే స్టేషన్లు, కోచింగ్‌ యార్డులు, కీలక రైల్వే సంస్థాపనల పర్యవేక్షణతోపాటు పట్టాలు దాటడం, చోరీలు, రైల్వే భూముల ఆక్రమణలను గుర్తించడంలోనూ డ్రోన్లు సహకరిస్తున్నాయి. ప్రమాదాలు, విపత్తుల సమయంలో సహాయక చర్యలకు, దర్యాప్తులకు అవసరమైన సమాచారాన్ని అందిస్తున్నాయి.

రథయాత్రలో కీలక సేవలు

పూరీలో ఈ ఏడాది రథయాత్ర సందర్భంగా భారీగా తరలివచ్చిన భక్తుల రద్దీని నియంత్రించడంలో డ్రోన్‌ నిఘా కీలక పాత్ర పోషించింది. మహిళా ప్రయాణికుల భద్రత కోసం అమలు చేస్తున్న ‘మేరీ సహేలీ’ కార్యక్రమానికి ఈ వ్యవస్థ సహకరిస్తోంది. రైల్వే పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, ప్రమాదకర ప్రాంతాల్లోని రైల్వే ఆస్తుల పర్యవేక్షణకు సైతం డ్రోన్లను వినియోగిస్తున్నారు. ప్రత్యక్ష నిఘాతోపాటు ఆడియో హెచ్చరికలు జారీ చేయడం ద్వారా అనధికారికంగా రైల్వే పట్టాలు దాటడం, రైళ్లపై రాళ్లు రువ్వడం వంటి చర్యలను నిరుత్సాహపరుస్తున్నారు.

ఒక్క బృందంతో 8 నుంచి 10 కిలో మీటర్ల నిఘా

ఒక డ్రోన్‌ బృదం సుమారు 8 నుంచి 10 కిలో మీటర్ల పరిధిని సమర్థంగా పర్యవేక్షించగలదు. దీంతో భద్రతా సిబ్బందిని అవసరమైన ప్రాంతాల్లో సమర్థంగా వినియోగించుకోవడంతోపాటు, విస్తృత ప్రాంతాల్లో నిఘాను బలోపేతం చేయవచ్చు. 2027 మార్చి నాటికి డ్రోన్ల సంఖ్యను 22కు పెంచడం ద్వారా రైల్వే ఆస్తుల పరిరక్షణ, నేరాల నివారణ, ప్రయాణికుల భద్రతను మరింత మెరుగుపరచాలని తూర్పు కోస్తా రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement