1,196 నామినేషన్లు తిరస్కరణ
బరిలో 6,362 మంది అభ్యర్థులు
భువనేశ్వర్: ఎనిమిదేళ్ల విరామం తర్వాత ఒడిశాలో ఈ నెల 15న జరగనున్న విద్యార్థి సంఘ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. నామినేషన్ల పరిశీలన, తిరస్కరణలు, ఉపసంహరణలతో ఎన్నికల సందడి ఊపందుకోగా, పలు కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. మరోవైపు, ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయంటూ అధికార బీజేపీ, ప్రతిపక్ష బీజేడీ, కాంగ్రెస్‌ల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు రాజకీయ వేడిని పెంచాయి. అక్టోబర్ 15న పోలింగ్తోపాటు ఫలితాల ప్రకటన కూడా జరగనుంది.
1,196 నామినేషన్ల తిరస్కరణ
రాష్ట్రవ్యాప్తంగా నామినేషన్లు దాఖలు చేసిన 8,370 మందిలో 1,196 మంది అభ్యర్థుల పత్రాలను అధికారులు తిరస్కరించారు. మిగిలిన 7,174 మంది పోటీకి అర్హత సాధించారు. వీరిలో 405 మంది నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో తుది జాబితాలో 6,769 మంది అభ్యర్థులు నిలిచారు. ఉన్నత విద్యాశాఖ ఈ జాబితాను విడుదల చేసింది.
1,600 మందికిపైగా ఏకగ్రీవ విజయం
ఎన్నికల బరిలో నిలిచిన వారిలో కళాశాల స్థాయిలో 1,620 మంది, విశ్వవిద్యాలయ స్థాయిలో 33 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్ష పదవికి 1,149 మంది, ప్రధాన కార్యదర్శి పదవికి 758 మంది పోటీ పడుతున్నారు. కీలక పదవుల కోసం అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేయడంతో క్యాంపస్‌లలో ఎన్నికల సందడి నెలకొంది.
జాబితాలపై వివాదాలు.. క్యాంపస్‌లలో ఉద్రిక్తతలు ఉత్కళ విశ్వవిద్యాలయంలోని కామర్స్ బ్లాక్‌లో అభ్యర్థుల జాబితా ప్రకటించకపోవడంతో ఉద్రిక్తత నెలకొని విద్యార్థుల మధ్య ఘర్షణకు దారితీసింది. కటక్‌లోని శైలబాల మహిళా కళాశాలలో ఏబీవీపీ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురికావడంతో విద్యార్థులు కళాశాల గేటు వద్ద ఆందోళనకు దిగారు. బాలాసోర్‌లోని ఫకీర్ మోహన్ విశ్వవిద్యాలయం కొత్త క్యాంపస్‌లోనూ పలువురు అభ్యర్థుల పేర్లను నామినేషన్ల అనంతరం జాబితా నుంచి తొలగించారని ఆరోపిస్తూ విద్యార్థులు నిరసన తెలిపారు. దీనిపై స్పందించిన ఉపకులపతి, కొందరు విద్యార్థులు గడువు ముగిసిన తర్వాత రావడంతో వారి దరఖాస్తులను స్వీకరించలేదని స్పష్టం చేశారు.
క్యాంపస్ వివాదం.. రాజకీయ దుమారం
విద్యార్థి సంఘ ఎన్నికల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ ప్రతిపక్ష బీజేడీ, కాంగ్రెస్ అధికార బీజేపీపై విమర్శలు గుప్పించాయి. అధికార పార్టీకి అనుకూలంగా రాష్ట్ర యంత్రాంగం వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ఓటమి భయంతో బీజేపీ నాయకులు, కార్యకర్తలు హింసకు పాల్పడటంతోపాటు నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులను అపహరించారని బీజేడీ ఆరోపించింది. పట్టాముండైలోని మదన్‌పూర్ యూకే మహాబీర్ మహావిద్యాలయానికి చెందిన బిజూ ఛాత్ర జనతా దళ్ అభ్యర్థి అపహరణ ఘటనను ఉదాహరణగా పేర్కొంది. బీజేపీకి విజయావకాశాలు లేని కళాశాలల్లో ఎన్నికలను నిరవధికంగా వాయిదా వేయాలని ప్రిన్సిపాళ్లపై ఒత్తిడి తెస్తున్నారని బీజేడీ విద్యార్థి విభాగం అధ్యక్షురాలు ఈప్సితా సాహు ఆరోపించారు. తమకు అనుకూలమైన అభ్యర్థుల విజయానికి మార్గం సుగమం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తోందని కాంగ్రెస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు బిభూతి భూషణ్ మహాపాత్రో విమర్శించారు. ఎనిమిదేళ్ల తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికలు విద్యార్థి సంఘాల బలాబలాలకు పరీక్షగా మారడంతోపాటు రాష్ట్ర రాజకీయ పార్టీల మధ్య ఆధిపత్య పోరుకు వేదికగా నిలుస్తున్నాయి. పోలింగ్‌కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ క్యాంపస్‌లలో ఉత్కంఠ మరింత పెరుగుతోంది.


