భువనేశ్వర్: ఈ నెల 15న జరగనున్న విద్యార్థి సంఘ ఎన్నికల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు, శాంతిభద్రతల పరిరక్షణపై డీజీపీ బినయతోష్ మిశ్రా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. డీజీపీ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా ఎస్పీలు, రేంజ్ ఐజీలు, డీఐజీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమై పోలీసు యంత్రాంగానికి పలు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల సమయంలో కళాశాల ప్రాంగణాల్లో హింసకు తావులేకుండా చూడాలని, పోలింగ్ ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించడంతోపాటు ఎన్నికల అనంతరం ఘర్షణలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని డీజీపీ ఆదేశించారు. హింసాత్మక ఘటనలు జరిగిన తర్వాత స్పందించడం కంటే, ముందస్తు చర్యలతో వాటిని నివారించడంపై దృష్టి సారించాలని స్పష్టం చేశారు. ఇందుకోసం కళాశాల యాజమాన్యాలతో నిరంతరం సంప్రదింపులు జరిపి ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరమైనప్పుడు వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని ఆదేశించారు. కళాశాలల వారీగా సున్నిత పరిస్థితులను అంచనా వేసి, అవసరానికి అనుగుణంగా పోలీసు బలగాలను మోహరించాలని డీజీపీ సూచించారు. ఎన్నికలకు సంబంధించిన ఆందోళనలు, వివాదాలను తీవ్రంగా పరిగణించి చట్టప్రకారం తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సమావేశంలో ఇంటెలిజెన్స్ డైరెక్టర్ ఆర్.పి. కోచె, అదనపు డీజీపీ రాజేష్ కుమార్, భువనేశ్వర్–కటక్ జంట నగరాల అదనపు పోలీసు కమిషనర్ నరసింగ్ భోలా, రాష్ట్రంలోని రేంజ్ ఐజీలు, డీఐజీలు, అన్ని జిల్లాల ఎస్పీలు పాల్గొన్నారు.


