పర్లాకిమిడి: దసరా నవరాత్రులు సందర్భంగా వాసవీ కన్యకాపరమేశ్వరీ ఆలయంలో నిర్వహిస్తున్న నవరాత్రి పూజల్లో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోడూరు నారాయణ రావు పాల్గొన్నారు. ఆలయ అర్చకులు మణిశర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు వైశ్యరాజు బాలజీరాజు అమ్మవారి చిత్రపటం, దుశ్శాలువతో సత్కరించి ప్రసాదాలు అందజేశారు. కాశీనగర్ బ్లాక్బీజేపీ నాయకులు రోక్కొం సతీష్, పిన్నింటి కిరణ్, రఘురాం రెడ్డి, నృసింహా చరణ్ పట్నాయక్, తదితరులు పాల్గొన్నారు.
శైలపుత్రీ అవతారంలో దుర్గమ్మ..
పర్లాకిమిడి: పట్టణంలో అంకావీధి బాలసదన్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో భాస్కరభట్ల రవిప్రసాద్ శర్మ, జోస్యుల ప్రదీప్ శర్మ పండితుల ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా అమ్మవారు శైలపుత్రీ అవతారంలో భక్తులకు దర్శనం క ల్పించారు. పట్టణంలో 40మంది ముత్తైదువులతో నిత్య పసుపు కుంకుమ పూజలు చేయించారు. అలాగే రాజవీధిలో విశ్వనాథ కల్యాణ మండపమున దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా ప్రత్యేకంగా అమ్మవారి విగ్రహాన్ని పులఖండం రాంబాజ్జీ, ఆయన కుమారుడు పవన్కుమార్శర్మ అధిష్టించారు. ఆదివారం నుంచి పసుపు కుంకుమ పూజలు ముత్తైదువులు ఆచరించారు.
ఆదిత్యుని సన్నిధిలో భక్తుల పాట్లు
అరసవల్లి : ప్రత్యక్ష దైవం అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఆదివారం భక్తులు పలు అవస్థలు పడ్డారు. ఉదయం నుంచే భానుడి ప్రతాపం అధికంగా ఉండటంతో భక్తులు తీవ్ర ఉక్కబోతకు గురయ్యారు. మంచినీటిని ఎక్కడికక్కడ ఏర్పాటు చేసినప్పటికీ పరిశుభ్రత పాటించకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. ఎండ తాకిడికి వృద్ధులు, చిన్నారులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఆలయం ముందు టెంట్లు చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రసాదాల విక్రయాల విషయంలో కూడా ఆన్లైన్ సేవలు మొరాయించాయి. ఒక్కసారిగా విక్రయాల విభాగంపై ఒత్తిడి రావడంతో సిబ్బంది కూడా ఇబ్బందులు పడ్డారు.
బౌద్ధారామాల సందర్శన
గార: శాలిహుండంలోని బౌద్ధారామాలను కా శీబుగ్గ పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఆదివారం సందర్శించారు. పర్యాటక ప్రాంతాల సందర్శనలో భాగంగా ఇక్కడికి వచ్చి శాలిహుండంలో బౌద్ధం వ్యాప్తి చెందిన విశేషాలను, అప్పటి కట్టడాలు, ఆరామాల చరిత్రను తెలుసుకున్నారు.
గట్కా పోటీల్లో జిల్లా జట్టు ప్రతిభ
నరసన్నపేట: స్కూల్ గేమ్స్లో భాగంగా కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ఈ నెల 9, 10 తేదీల్లో నిర్వహించిన గట్కా పోటీల్లో జిల్లా జట్టు ప్రతిభ చూపి ఓవరాల్ చాంపియన్షిప్ను కై వసం చేసుకున్నారు. ఈ పోటీల్లో ఏకంగా 23 మంది బాలబాలికలు బంగారు పతకాలు, ఒకరు రజత పతకం సాధించారు. దీంతో రాష్ట్ర స్థాయిలో ఓవరాల్ చాంపియన్షిప్ కూడా జిల్లా జట్టుకు లభించిందని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి ఎం.జ్యోతిరాణి తెలిపారు. స్థానిక గట్కా కోచ్ ఖగేశ్వరరావు ఆధ్వర్యంలో 32 మంది బాలబాలికలు ఈ పోటీల్లో పాల్గొన్నారు.
మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో పతకాల పంట
శ్రీకాకుళం న్యూకాలనీ: రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో సిక్కోలు వెటరన్ అథ్లెట్స్ పతకాల పంట పండించారు. గుంటూరులోని ఆచార్య నాగార్జునా యూనివర్సిటీ వేదికగా శని, ఆదివారాల్లో జరిగిన 45వ ఆంధ్రప్రదేశ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్–2026 పోటీల్లో శ్రీకాకుళం మాస్టర్ అథ్లెట్స్ 35 పతకాలు సాధించి సత్తాచాటారు. ఇందులో 13 బంగారు, ఏడు రజత, మరో 15 కాంస్య పతకాలు ఉన్నాయి.


