రాయగడ: దసర ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నుంచి శరన్నవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవంగా పూజలందుకుంటున్న మజ్జిగౌరీ అమ్మవారి మందిరం విద్యుత్ దీపాలతో ధగధగ లాడుతుంది. అమ్మవారు బంగారు ఆభరణాలతో భక్తులకు దర్శనం ఇచ్చారు. అమ్మవారి స్వర్ణ అలంకరణలో చూసి తరించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో మందిరం భక్తులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఇదిలాఉండగా స్థానిక కస్తూరీనగర్లోని సత్యనారాయణ మందిరం ప్రాంగణంలో కొలువైయున్న లక్ష్మీదేవి అమ్మవారికి నవరాత్రులను పురస్కరించుకుని ప్రత్యేకంగా అలంకరించి పూజా కార్యక్రమాలు చేపట్టారు. అలాగే స్థానిక బాలాజీనగర్లోని శ్రీకల్యాణవేంకటేశ్వర మందిరంలో ఉన్న రాజ్యలక్ష్మీదేవి అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకులు భాస్కరాచార్యులు ఆధ్వర్యంలో నవావరణ అర్చన, పుష్పాలంకరణ పూజలు జరిగాయి.


