భువనేశ్వర్: పూరీ శ్రీ జగన్నాథ స్వామి ఆలయంలో శరన్నవరాత్రుల సందర్భంగా పదహారు రోజుల షోడశ పూజలు లేదా షోళ పూజల్లో భాగంగా నిర్వహిస్తున్న విశిష్టమైన దుర్గా మాధవ ఉపాసన తొలి దశ ముగిసింది. ఆది వారం నుంచి మలి దశ యాత్ర ప్రారంభమైంది. మూలాష్టమి సందర్భంగా శ్రీకారం చుట్టిన తొలి ఎనిమిది రోజులు దుర్గా మాధవులు విమలా దేవి ఆలయంలో పూజలకు తెర దించి చివరి ఎనిమిది రోజులపాటు నిర్వహించే శాక్త గుండిచా యాత్ర లేదా గుప్త గుండిచా యాత్ర ప్రారంభం అయింది. ఈ సందర్భంగా దుర్గా మాధవులు నారాయణి ఆలయానికి వేంచేస్తారు. శరన్నవరాత్రుల సందర్భంగా శ్రీ క్షేత్రం సంప్రదాయంలో మాధవుడు శ్రీ జగన్నాథ స్వామి తత్త్వానికి ప్రతీకగా, దుర్గాదేవి ఆదిపరాశక్తి స్వరూపంగా పూజలందుకుంటారు.
నారాయణి ఆలయానికి దుర్గా మాధవులు
షోడశ పూజల్లో తొమ్మిదో రోజైన పవిత్ర అశ్విని శుక్ల పక్ష ప్రతిపద తిథి పురస్కరించుకుని ఆదివారం నుంచి చివరి ఎనిమిది రోజులపాటు దుర్గా మాధవులను ప్రత్యేక విమానంలో నారాయణి ఆలయానికి తీసుకువెళతారు. అక్కడ పూజలు నిర్వహించిన అనంతరం తిరిగి శ్రీ మందిరానికి తీసుకు వస్తారు. ఈ సందర్భంగా రత్న సింహాసనంపై పూజలందుకునే మాధవునితో రత్న భాండాగారంలోని దుర్గాదేవి నారాయణి ఆలయానికి వేంచేయడం ఈ యాత్ర విశేషం.


