పర్లాకిమిడి: స్థానిక శ్రీక్రిష్ణచంద్ర గజపతి స్వయం ప్రతిపత్తి కళాశాల విద్యార్థి సంఘం కౌన్సిల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు వేసే ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ శనివారం సాయంత్రం విద్యార్థులు ఆందోళన చేపట్టారు. దీంతో ఎటువంటి ఉద్రిక్తలకు దారితీయకుండా కళాశాల వద్ద పోలీసు బలగాలు మోహరించారు. అయితే శుక్రవారం జరిగిన నామినేషన్ల పర్వంలో విద్యార్థులు వివిధ పదవులకు వేసిన నామినేషన్లు తుది అభ్యర్థుల జాబితాలో ఇద్దరు గడువు పూర్తయిన తరువాత వారి నామినేషన్లు ప్రిన్సిపాల్ అంగీకరించారనే కోపంతో విద్యార్థులు శనివారం సాయంత్రం కళాశాల గేటు బయట ఆందోళన చేపట్టారు. దీంతో కొంతసేపు ఉద్రిక్తత ఏర్పడింది. విద్యార్థి సంఘం ప్రెసిడెంటు, ఉపాధ్యక్షులు, సాధారణ కార్యదర్శి, సైన్స్ సోసూటీ సెక్రటరీ, స్పోర్ట్స్, గర్ల్స్ కామన్ రూం సెక్రటరీ పదవులకు విద్యార్థినీ విద్యార్థులు అధిక సంఖ్యలో నామినేషన్లు వేయగా వాటిలో 36 స్టూడెంట్స్ ఎలక్షన్ గైడ్లైన్స్ ప్రకారం చెల్లిన నామినేషన్లుగా తుది జాబితాలో ప్రిన్సిపాల్ రాధాకాంత భుయ్యాన్ ప్రకటించారు. వీటిలో రెండు నామినేషన్లు నిన్నగడువు తీరిన తరువాత మధ్యాహ్నం 3.30 గంటలకు వచ్చి నామినేషన్లు వేశారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. దీనిపై సమగ్రమంగా సీసీ పూటేజీ ద్వారా దర్యాప్తు చేయాలని విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. మోడల్ పోలీసు అధికారి ప్రశాంత్ భూపతి శాంతి భద్రతలకు విఘాతం కలుగుకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.


