భువనేశ్వర్: పాఠశాలలో అవకతవకలు, సమస్యలు నెలకొన్నాయని ఆరోపిస్తూ మయూర్భంజ్ జిల్లా శ్యామ్సుందర్పూర్ ఏకలవ్య ఆదర్శ నివాస పాఠశాలకు చెందిన సుమారు 500 మంది విద్యార్థులు శనివారం నిరసన చేపట్టారు. పాఠశాల నుంచి బంగిరిపోసి మండల కార్యాలయం వరకు సుదీర్ఘంగా 10 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. సమస్యలపై పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించలేదని విద్యార్థులు ఆరోపించారు. తమ సమస్యలను మండల యంత్రాంగం, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లేందుకే పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. ఈ నిరసనపై స్పందించిన అధికారులు సమస్యల పరిష్కారానికి చర్యలు ప్రారంభించారు.


