భద్రక్‌లో 3 కళాశాలల్లో ఎన్నికలు రద్దు | - | Sakshi
Sakshi News home page

భద్రక్‌లో 3 కళాశాలల్లో ఎన్నికలు రద్దు

Oct 10 2026 12:40 AM | Updated on Oct 10 2026 12:40 AM

న్యూస్‌రీల్‌

శనివారం శ్రీ 10 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

● నామి కళాశాల నిరవధిక మూసివేత

● అధ్యక్ష పదవికి ఐదు నామినేషన్లు

రాయగడ: స్థానిక అటానమస్‌ కళాశాలలో ఈ నెల 15 వ తేదీన జరగనున్న విద్యార్థి సంఘం ఎన్నికల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఎన్నికల సందడితో విద్యార్థులు వివిధ పదవులకు పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో శుక్రవారం నాడు ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యే సరికి విద్యార్థి సంఘం అధ్యక్ష పదవి కోసం ఐదుగురు పోటీ పడుతుండగా ఉపాధ్యక్ష పదవి కోసం ముగ్గురు, కార్యదర్శి పదవి కోసం నలుగురు, సహాకార్యదర్శి పదవి కోసం మరో ముగ్గురు తమ తమ నామినేషన్లను దాఖలు చేశారు. శనివారం నాడు నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం ఉంటుందని ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న అటానమాస్‌ కళాశాల అధ్యక్షులు పి.అరుణ్‌ కుమార్‌ తెలియజేశారు. ఈ నెల 15 వ తేదీన జరగనున్న ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టమని ఆయన తెలిపారు. ఎన్నికలు పూర్తయ్యే రోజు సాయంత్రం ఫలితాలను ప్రకటిస్తామని చెప్పారు.

భువనేశ్వర్‌: ఎనిమిదేళ్ల విరామం తర్వాత ఒడిశాలో తిరిగి జరుగుతున్న విద్యార్థి సంఘ ఎన్నికలు పలు కళాశాలల్లో ఉద్రిక్తతలకు దారితీశాయి. విద్యార్థుల ఆందోళనలు, అశాంతి నేపథ్యంలో భద్రక్‌ జిల్లాలోని మూడు కళాశాలల్లో ఎన్నికలను రద్దు చేయగా, నామి డిగ్రీ కళాశాలను నిరవధికంగా మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలల్లో శుక్రవారం విద్యార్థి సంఘ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది. చెల్లుబాటైన నామినేషన్ల జాబితా ప్రచురణతో వివిధ క్యాంపస్‌లలో ఎన్నికల సందడి నెలకొంది. తమ అభ్యర్థులకు మద్దతు కూడగట్టుకునేందుకు విద్యార్థి సంఘాలు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. భద్రక్‌ మహిళా కళాశాల, నామి డిగ్రీ కళాశాల, ఒగొరొపొడ కళాశాలల్లో ఎన్నికలను రద్దు చేశారు. దీనిపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఎన్నికలు నిర్వహించాలని, కళాశాలలను తిరిగి తెరవాలని డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో నామి డిగ్రీ కళాశాలను శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యేంత వరకు నిరవధికంగా మూసివేస్తున్నట్లు కళాశాల అధికారులు ప్రకటించారు.

కలెక్టర్‌ కార్యాలయం ముట్టడి

నయాగఢ్‌ జిల్లాలోని ఇట్టామట్టి బన్సీధర్‌ కళాశాలలో ఎన్నికలకు బదులుగా ఎంపిక విధానంలో విద్యార్థి ప్రతినిధులను నియమించాలన్న నిర్ణయంపై విద్యార్థులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు.

పలుచోట్ల ఏకగ్రీవ ఎన్నికలు

జాజ్‌పూర్‌ జిల్లాలోని ధర్మశాల కళాశాలలో అధ్యక్షుడితో సహా 17 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే కియోంఝర్‌ జిల్లాలోని ఝుంపురా పంచాయతీ సమితి కళాశాలలో 13 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు సమాచారం. అభ్యర్థులు శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. తుది అభ్యర్థుల జాబితాను మధ్యాహ్నం 3 గంటలకు ప్రకటించనున్నారు. రాష్ట్రంలోని 13 విశ్వవిద్యాలయాలు, 328 కళాశాలల్లో ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించనుండగా, మరో 205 విద్యాసంస్థల్లో ఎంపిక విధానం ద్వారా విద్యార్థి ప్రతినిధులను ఎన్నుకోనున్నారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం అక్టోబర్‌ 14న ‘నేనెందుకు పోటీ చేస్తున్నాను’ అనే అంశంపై అభ్యర్థులు తమ అభిప్రాయాలను వెల్లడించే సమావేశం నిర్వహించనున్నారు. అక్టోబర్‌ 15న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. అనంతరం అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి, ఫలితాలను ప్రకటిస్తారు. కొత్తగా ఎన్నికై న విద్యార్థి ప్రతినిధుల ప్రమాణ స్వీకార కార్యక్రమం అక్టోబర్‌ 16న నిర్వహించనున్నారు.

టిట్లాగఢ్‌కు జిల్లా హోదా కోరుతూ కళాశాల ఎన్నికల బహిష్కరణ

భువనేశ్వర్‌: టిట్లాగఢ్‌కు జిల్లా హోదా కల్పించాలనే దీర్ఘకాలిక డిమాండ్‌ నెరవేరకపోవడాన్ని నిరసిస్తూ, బొలంగీర్‌ జిల్లాలోని టిట్లాగఢ్‌ డీఏవీ అటానమస్‌ కళాశాల విద్యార్థులు విద్యార్థి సంఘ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటించిన విద్యార్థులు, ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు దూరం పాటించినట్లు వెల్లడించారు. టిట్లాగఢ్‌ను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలనే డిమాండ్‌ 1992 నుంచి కొనసాగుతోంది. దశాబ్దాలుగా ఆందోళనలు, వివిధ రూపాల్లో నిరసనలు చేపట్టినా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లభించలేదని విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ డిమాండ్‌ను నెరవేర్చడంలో జరుగుతున్న జాప్యానికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. టిట్లాగఢ్‌కు అధికారికంగా జిల్లా హోదా కల్పించే వరకు విద్యార్థి సంఘ ఎన్నికల్లో పాల్గొనబోమని స్పష్టం చేశారు. తమ నిరసన ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి, చిరకాల డిమాండ్‌ సాధించుకోవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement