పర్లాకిమిడి: గజపతి జిల్లాలో పర్లాకిమిడి, మోహన బ్లాక్ పాణిగండా అటవీ సెక్షన్లో రెండు పులిచర్మాలను స్వాధీనం చేసుకుని, ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్టు జిల్లా ముఖ్యఅటవీ అధికారి కె.నాగరాజు తెలియజేశారు. స్థానిక దేవగిరి రేంజ్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. తొలుత పర్లాకిమిడి కొత్త బస్టాండులో నిన్న రాత్రి ఇద్దరు నిందితులు ఇతర రాష్ట్రాలకు ఒక బ్యాగులో పులిచర్మంను ఇద్దరు నిందితులు గోర్రిల రవి (4), ప్రఫుల్ల ఘంట (42) తరలిస్తుండగా ఏసీఎఫ్ షైనీశ్రీదాస్ టీంకు దొరికిపోయారు. వీరిలో గోర్రిల రవి కాశీనగర్ పోలీస్స్టేషన్, హడ్డుబంగి వాసి కాగా, మరొకరు ప్రఫుల్ల ఘంట కాశీనగర్ బ్లాక్ పరిడా గ్రామానికి చెందిన వాడు. వీరి వద్ద నుంచి ఒక పులిచర్మం, మోటారు సైకిల్, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని వారిపై వన్యమృగాల చట్టం కింద కేసు పెట్టి కోర్టుకు తరలించినట్లు డీఎఫ్ఓ నాగరాజు తెలిపారు.
అలాగే మరో కేసులో శుక్రవారం ఉదయం అక్రమంగా పులిచర్మాలు కలిగి ఉన్నారని అందిన సమాచారం మేరకు ఏసీఎఫ్ షైనిశ్రీ దాస్ బృందం, మోహన అటవీ రేంజ్ అధికారి లక్ష్మీప్రసాద్ బిశోయి బృందం కలిసి ఉదయం 11.30కు పాణిగండ సెక్షన్లో తులసినగర్ గ్రామంలో మోహన అటవీ రేంజ్ అధికారులు కాపుకాసి నలుగురు నిందితులు, ఒక పులిచర్మం వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నలుగురు నిందితులు జగా మల్లిక్ (36) కంధమాల్ జిల్లా దరింగిబడి బ్లాక్ తియారిగాం, బిజయనంద నాయక్ (23) దసింగిబడి గ్రామం, దరింగిబడి పీఎస్, కంధమల్, అడవ పోలీసుష్టేషన్, పాణిగండ గ్రామానికి చెందిన త్రిలోచన పాత్రో(35), దరింగిబడి పి.యస్. కంధమల్ జిల్లా, దసింగిబడి గ్రామానికిచెందిన దీపక్కుమార్నాయక్ (25)గా గుర్తించినట్టు డీఎఫ్ఓ నాగరాజు తెలియజేశారు.
వీరి వద్ద నుంచి ఒక పులిచర్మం, రెండు మోటారు సైకిళ్లు, నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని వారిపై వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద మోహనా అటవీ రేంజ్ కార్యాలయంలో కేసు నమోదు చేశారు.


