రాయగడ: స్థానిక రైతుల కాలనీలోని నవజీవన్ ట్రస్టు ఆధ్వర్యంలో శుక్రవారం నిరుపేదలైన 40 మంది ఆదివాసీ వృద్ధ మహిళలకు ఉచితంగా నిత్యావసరాలను పంపిణీ చేశారు. బియ్యం, నూనె, బంగాళదుంపలు, కందిపప్పు వంటి తదితర నిత్యవసరాలను పంపిణీ చేసినట్లు ట్రస్టు నిర్వాహకురాలు ఎం.నళిని తెలిపారు. ప్రతినెలా ఆదివాసీ వృద్ధ మహిళలకు ట్రస్టు ద్వారా నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తున్నట్లు ఆమె తెలిపారు. తిరుపతిలోని ట్రస్టు వ్యవస్థాపకులు డాక్టర్ శ్రీధర్ ఆచార్య ఆదివాసీ, హరిజన ప్రాంతమైన ఈ ప్రాంతంలో ట్రస్టును ఏర్పాటు చేసి ఎంతోమంది నిరుపేదలకు ఆశాదీపంగా ఆదుకుంటున్నారని తెలిపారు. అదేవిధంగా ఈ ట్రస్టు ద్వారా సుమారు వందమందికి పైగా నిరుపేదలైన అనాథ, ఆదివాసీ యువతులకు ఉచితంగా భోజన, వసతి సౌకర్యం కల్పించడంతో పాటు వారికి చదువు కూడా చెప్పిస్తున్నారని వెల్లడించారు.
ఆయుష్మాన్ కార్డుల దుర్వినియోగం
మల్కన్‌గిరి: జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన రోగులను సేకరించి విశాఖపట్నంకు తరలిస్తూ దళారులు ఆయష్మాన్ కార్డుల్లో లక్షలు దోచుకుంటున్నారని చిత్రకొండ ఎమ్మెల్యే మంగు ఖీలో ఆరోపించారు. ఈ మేరకు సమారు 50 మంది రోగులతో విశాఖపట్నం నుంచి మల్కన్‌గిరికి వచ్చిన ఒక బస్సును ఆయన శుక్రవారం అడ్డుకున్నారు. దళారులు గ్రామాల్లో తిరుగుతూ రోగులకు ఆయుష్మాన్ కార్డులపై వైద్య పరీక్షలు చేయిస్తామని చెప్పి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని పేర్కొన్నారు. శుక్రవారం అడ్డుకున్న బస్సులో 50 మంది వరకు రోగులు ఉన్నారు. దీంతో దళారులను పట్టుకొని విచారించగా ఖోయిర్‌పూట్ సమితి కూడుములగూమ్మకు చెందిన ఒక వ్యక్తి తరిస్తున్నట్లు తెలిసింది. దీంతో ఆయనపై కేసు నమోదు చేయాలని ఎమ్మెల్యే డిమాండ్వ చేశారు. వారి కార్డుల్లో ఉన్నటువంటి డబ్బులు లూటీ చేస్తున్నారని ఆరోపించారు.
ఎస్‌ఈబీసీల స్థితిగతులపై అధ్యయనానికి కమిషన్
భువనేశ్వర్: రాష్ట్రంలో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల (ఎస్ఈబీసీ) జనాభా, స్థానిక సంస్థల్లో వారి రాజకీయ ప్రాతినిధ్యాన్ని అంచనా వేసేందుకు ఒడిశా ప్రభుత్వం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి, బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఒడిశా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ప్రమత్ పట్నాయక్ కమిషన్ చైర్‌పర్సన్‌గా, విశ్రాంత ఐఏఎస్ అధికారి బిజయ్ కుమార్ పృష్టి సభ్యుడిగా నియమితులయ్యారు. ఆ శాఖ ప్రత్యేక కార్యదర్శి సుజాత మిశ్రా సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు. పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థల్లోని మొత్తం జనాభాలో ఎస్‌ఈబీసీల వాటాను కమిషన్ అంచనా వేయనుంది. ఆయా సంస్థల్లో వారికి ప్రస్తుతం ఉన్న రాజకీయ ప్రాతినిధ్యాన్ని పరిశీలించడంతోపాటు, జనాభా నిష్పత్తితో పోలిస్తే వారి రాజకీయ ప్రాతినిధ్యంలో ఉన్న లోటుపాట్లు, వాటి స్వభావం, ప్రభావాలను అధ్యయనం చేయనుంది. గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో ఎస్‌ఈబీసీల సామాజిక, రాజకీయ ప్రాతినిధ్యంపై సమగ్ర అధ్యయనం చేపట్టాలని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ నిర్ణయించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ కమిషన్‌ను ఏర్పాటు చేసింది.


