భువనేశ్వర్: బిజూ జనతా దళ్ (బీజేడీ) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ ప్రభుత్వం ఒడిశా ప్రతిష్టను దెబ్బతీసి, గత బీజేడీ ప్రభుత్వ అభివృద్ధి విజయాలను బలహీనపరిచిందని ఆయన ఆరోపించారు. భువనేశ్వర్ ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గంలోని ఆర్టిఓ గ్రౌండ్లో శుక్రవారం జరిగిన బీజేడీ జన సంపర్క్ పాదయాత్ర సందర్భంగా భారీ జనసమూహాన్ని ఉద్దేశించి నవీన్ పట్నాయక్ మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సేవ తమ పార్టీ లక్ష్యంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో వేలాది మంది బీజేడీ కార్యకర్తలు, నాయకులు, మద్దతుదారులతో పాటు పలువురు సీనియర్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ బీజేడీ ప్రభుత్వ హయాంలో ఒడిశా గణనీయమైన అభివృద్ధిని సాధించి దేశంలో ఒక ఆదర్శ రాష్ట్రంగా ఆవిర్భవించిందని పేర్కొన్నారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఒడిశా ప్రతిష్టను దెబ్బతీసింది అని ఆయన ఆరోపించారు. పార్టీ కార్యకర్తలు ప్రతి ఇంటికీ వెళ్లి, బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకు తెలియజేయాలని బీజేడీ అధినేత కోరారు. అభివృద్ధి, ప్రజా సంక్షేమం పట్ల తమ పార్టీ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ, ప్రజలతో తమ సంబంధాన్ని బలోపేతం చేసుకోవాలని, ప్రభుత్వ లోపాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని పట్నాయక్ బీజేడీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీజేడీ అక్టోబర్ 2న రాష్ట్ర వ్యాప్త జన సంపర్క్ పాదయాత్రను ప్రారంభించింది. నెల రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం ఒడిశా వ్యాప్తంగా ప్రజలతో మమేకమై పార్టీ రాజకీయ అజెండాను, బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ పనితీరు తెలియజేయడం లక్ష్యంగా పెట్టుకుంది.


