● చిత్రకొండ సమితిలో 1500 కిలోల గంజాయి పట్టివేత
మల్కన్‌గిరి: గంజాయి అక్రమ రవాణా గుట్టురట్టయింది. మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ సమితి జోడాంబు పోలీసులు కొండ ప్రాంతాల్లో దాడులు నిర్వహించి భారీగా గంజాయి నిల్వలను గుర్తించారు. ఓ గోతులో నాలుగు ఇనుప ప్రెస్సింగ్ బాక్సులతో పాటు 1500 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గురువారం పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో పోలీసులకు సదారాం గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో గంజాయి ఉన్నట్టు సమాచారం వచ్చింది. దీంతో జోడాంబు పోలీసుస్టేషన్ ఐఐసీ మానోరంజాన్ సాహు నేతృత్వంలో ఉన్న ఆంధ్ర–ఒడిశా సరిహద్దు గ్రామంలో దాడులు చేసి.. అక్కడ అక్రమంగా రవాణా చేసేందుకు సిద్ధంగా ఉన్న గంజాయి బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ గంజాయిని జిల్లా ఎస్పీ వినోద్ పటెల్ ఆదేశాల మేరకు చిత్రకొండ ఎస్డీపీవో ప్రదోష్ ప్రధాన్ ఆధ్వర్యంలో తూకం వేయగా 1500 కిలోలు ఉన్నట్టు తేలింది. బహిరంగ మార్కెట్లో దీని విలుల కోటిన్నర రూపాయలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. కేసునమోదు చేసి గంజాయి ఎవరిదో అనే కోణంలో దర్యాప్తు చేస్తామన్నారు.
కలిమెల సమితిలో
25 కిలోలు స్వాధీనం : ఇద్దరు అరెస్టు
మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి పోలీసులు గురువారం రాత్రి వాహన తనిఖీలు చేస్తుండగా గంజాయి అక్రమ రవాణా వెలుగు చూసింది. ఈ సందర్భంగా 22 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని ఇద్దరిని అరెస్టు చేశారు. కలిమెల ఐఐసీ ప్రభుదత్తు తెలిపిన వివరాలు ప్రకారం.. గంజాయి అక్రమ రవాణాను నివారించే క్రమంలో కలిమెల సమితి యం.వి.90 గ్రామం వద్ద పెట్రోలింగ్ చేస్తుండగా.. తెలంగాణా రిజిస్ట్రేషన్ నెమ్ప్లేట్ ఉన్న ఆటో అనుమానాస్పదంగా వెళ్తుండగా.. దారి ఆపి తనిఖీ చేశారు. దీంతో అందులో 22 కిలోల గంజాయి పట్టుబడడంతో అందులో ఉన్న ఇద్దరు వ్యక్తుపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. పట్టబడిన గంజాయి విలువ రూ. మూడు లక్షలు ఉంటుందని చెప్పారు. పట్టుబడిన వ్యక్తులు కలిమెల సమితి పురుషగూఢ గ్రామానికి చెందిన చంద్ర సోల్బం, రామమూర్తి సోల్బంగా గుర్తించారు. నిందితులను కోర్టుకు తరలించామన్నారు.


