● బీజేడీ నాయకుడు భృగుభక్షి పాత్రో
● ఎంఎండీఆర్ చట్ట సవరణకు వ్యతిరేకంగా ర్యాలీ
రాయగడ: ఒడిశా ఖనిజ సంపదపై రాష్ట్రానికి ఉన్న హక్కులు, ఆర్థిక ప్రయోజనాలను కాపాడాల్సిన అవసరం ఉందని బీజేడీ నాయకుడు భృగుభక్షి పాత్రో అన్నారు. ఖనిజ సంపదపై కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో రాష్ట్ర ప్రయోజనాలు, ఖనిజ ప్రాంతాల్లో నివసించే ప్రజల సంక్షేమాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరారు. ఎంఎండీఆర్ చట్ట సవరణను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేడీ ఆధ్వర్యంలో రాయగడలో భారీ నిరసన ర్యాలీ ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జగన్నాథ సరక ఆధ్వర్యంలో శనివారం జరిగింది. ముందుగా స్థానిక కొత్త బస్టాండ్ వద్దనున్న బిజూ పట్నాయక్ విగ్రహానికి ఆ పార్టీ నాయకులు ప్రదీప్ మాఝి, మాజీ మంత్రి ప్రీతిరంజన్ ఘొడేయ్, సుదమా మారండీ, బీజేడీ రాష్ట్ర యువజన శాఖ అధ్యక్షుడు చిన్మయ సాహు, అనసూయా మాఝి, సుధీర్ దాస్ తదితరులు నివాళులర్పించిన అనంతరం ర్యాలీలో పాల్గొన్నారు. కలెక్టర్ కార్యాలయం గేటు వరకు ర్యాలీ చేపట్టారు.
ఆదాయంపై ప్రభావం లేకుండా చూడాలి
ఈ సందర్భంగా భృగిభక్షి పాత్రో మాట్లాడుతూ.. ఖనిజ సంపద విషయంలో ఒడిశా రాష్ట్రం దేశంలోనే కీలక రాష్ట్రంగా గుర్తింపు పొందిందన్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఖనిజ తవ్వకాలపై ప్రజల జీవనోపాధి, పర్యావరణం ఆధారపడి ఉన్నాయని పేర్కొన్నారు. ఖనిజ వనరుల ద్వారా వచ్చే ఆదాయాన్ని రాష్ట్ర అభివృద్ధికి, ముఖ్యంగా విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, పేదరిక నిర్మూలన, స్థానిక ప్రాంతాల అభివృద్ధికి వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు. ఎంఎండీఆర్ చట్ట సవరణ–2021తో పాటు ఖనిజ రంగానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రాల హక్కులు, ఆదాయంపై ప్రభావం పడకుండా చూడాలని పేర్కొన్నారు. ఖనిజ సంపద ఉన్న ప్రాంతాల ప్రజలకు దాని ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేశారు. ఖనిజ వనరుల వినియోగంలో రాష్ట్ర ప్రభుత్వానికి తగిన ఆర్థిక ప్రయోజనం దక్కాలన్నారు. అందువల్ల కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన ఎంఎండీఆర్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని, లేనిపక్షంలో తమ పార్టీ తరుపున ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అనంతరం భారత రాష్ట్రపతి పేరిట ఒక వినతిపత్రంను కలెక్టర్ అశుతోష్ కులకర్ణికి సమర్పించారు. కార్యక్రమంలో బీజేడీ సీనియర్ నాయకురాలు అనసూయా మాఝి, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సరస్వతి మాఝి తదితరులు పాల్గొన్నారు.


