భువనేశ్వర్: రాష్ట్రంలో ఇటీవల అనేక జిల్లాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల తీవ్రనష్టం వాటిళ్లింది. ప్రధానంగా పలుచోట్ల ఇళ్లు కుప్పకూలాయి. ఈ పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు పెద్ద హామీ ఇచ్చింది. వర్షాల కారణంగా ఇళ్లు ధ్వంసమైన వారికి ప్రభుత్వ పథకం కింద తక్షణమే కొత్త ఇళ్లు అందిస్తామని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి రబీ నారాయణ్ నాయక్ తెలిపారు. మంత్రి తెలిపిన వివరాల ప్రకారం గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 4 జిల్లాల్లో సుమారు 45 నుంచి 50 ఇళ్లు పూర్తిగా లేదా పాక్షికంగా ధ్వంసమయ్యాయి. వర్షాలు మరికొంతకాలం కొనసాగితే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రభావిత కుటుంబాలకు అంత్యోదయ గృహ యోజన కింద కొత్త ఇళ్లను అందిస్తారు. వర్షాలు తగ్గిన వెంటనే 5 రోజుల్లోగా జరిగిన నష్టంపై తుది నివేదిక దాఖలు చేయాలని అనుబంధ యంత్రాంగానికి మంత్రి ఆదేశించారు. ఇంద్రావతి నదిలో నీటిమట్టం పెరగడం వల్ల 6 పంచాయతీల ప్రజలు ప్రభావితులయ్యారు. వారికి తాత్కాలిక ఆశ్రయాల్లో ఉండేందుకు ఏర్పాట్లు చేసి ఆహారం, నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారని వెల్లడించారు.
సైబర్ భద్రతపై
అవగాహన శిబిరం
జయపురం: దిగాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో సైబర్ భద్రత, గృహహింస, వరకట్న నిషేధం తదితర సమస్యలపై కొరాపుట్ జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ సంస్థ జయపురం శనివారం అవగాహన శిబిరం నిర్వహించింది. దీనిలో భాగంగా సైబర్ నేరాలపై వివరిస్తూ ప్రజలు నకిలీ ఈ–మెయిల్స్, కాల్స్, మెసేజ్‌లపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరకట్నం అడగడం, ఇవ్వడం నేరమని స్పష్టం చేశారు. ఎవరైనా డిమాండ్ చేస్తే అటువంటి వారికి జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు. న్యాయసేవా ప్రదీకరణ అధ్యక్షుడు, జిల్లా జడ్జి ప్రదీప్ కుమార్ మహంతి అధ్యక్షతన జరిగిన శిబిరంలో న్యాయసేవా ప్రదీకరణ కార్యదర్శి ప్రద్యుమయి సుజాత, జిల్లా శిశు సంక్షేమ కమిటీ అధ్యక్షురాలు బి.గాయిత్రీ దేవి, బొయిపరిగుడ పోలీసు అధికారి లక్ష్మీనారాయణ ముధులి, సైబర్ సెల్ ఇన్‌స్పెక్టర్ కొరాపుట్ ఎన్.శివ తదితరులు పాల్గొన్నారు.


