నేడు బ్యాంకులు పనిచేస్తాయి | - | Sakshi
Sakshi News home page

నేడు బ్యాంకులు పనిచేస్తాయి

Sep 27 2026 1:22 AM | Updated on Sep 27 2026 1:22 AM

పర్లాకిమిడి: యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ పిలుపు మేరకు ఈనెల 28 నుంచి 30 వరకు బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేపట్టనున్నారు. ఈ మేరకు జిల్లాలోని అన్ని జాతీయ బ్యాంకులు ఆదివారం తెరువబడునని ఎస్‌బీఐ, యూనియన్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, కెనరా బ్యాంకుల మేనేజర్లు శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. కస్టమర్లు విత్‌డ్రా, డిపాజిట్లు, ఇతర లావాదేవీలు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

రోడ్డుపై కంటైనర్‌ బోల్తా

రాయగడ: జిల్లాలోని రామనగుడ పోలీస్‌స్టేషన్‌ పరిధి మహిపంగ సమీపంలో భారీ కంటైనర్‌ రోడ్డుపై బోల్తా పడింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌–ఒడిశాను కలిపే ప్రధాన 317వ రాష్ట్ర రహదారిపై సుమారు 20 గంటల పాటు రాకపోకలు నిలిచిపోయాయి. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సంబల్‌పూర్‌ నుంచి విశాఖపట్నం వైపు అల్యూమినియం లోడ్‌తో వెళ్తున్న కంటైనర్‌ వర్షం కారణంగా అదుపుతప్పి రోడ్డుకు అడ్డంగా బోల్తాపడింది. డ్రైవర్‌ సన్యాసినాయుడు స్వల్పగాయాలతో బయటపడ్డాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. రెండు భారీ క్రైన్ల సాయంతో కంటైనర్‌ను తొలగించారు. అనంతరం రాకపోకలు యథావిధిగా కొనసాగాయి.

గంజాయి కేసులో

మరొకరు అరెస్టు

పర్లాకిమిడి: పట్టణానికి రెండు కి.మీ దూరంలో ఉన్న బెత్తగుడ సాహిచౌక్‌ వద్ద గంజాయి కేసులో ఇటీవల పట్టుబడిన నిందితుడు సదాశివ పాణిగ్రాహిను పోలీసులు ప్రశ్నించి, సర్వసుద్ధి బాలాజీ అలియాస్‌ బాలు (45)ను శుక్రవారం అరెస్టు చేసి శనివారం కోర్టులో హాజరుపరిచారు. గంజాయి కేసులో సదాశివ పాణిగ్రాహి ప్రథమ నిందితుడుగా అరెస్టు కాగా, రెండో నిందితుడు గంజాయి సప్లయర్‌ బాలాజీ అలియాస్‌ బాలును కూడా అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ ప్రఫుల్ల జగరంగా తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement