భద్రత ఏమాత్రం..? | - | Sakshi
Sakshi News home page

భద్రత ఏమాత్రం..?

Sep 27 2026 1:22 AM | Updated on Sep 27 2026 1:22 AM

రాయగడ: కొరాపుట్‌–రాయగడ రైల్వేమార్గం (కేఆర్‌ లైన్‌) వర్షాకాలంలో తరచూ కొండచరియలు విరిగిపడడం, ట్రాక్‌పైకి మట్టి చేరడం, నీటితో పట్టాలు మునిగిపోవడం వంటి ఘటనలతో ప్రభావితమవుతోంది. తాజాగా సికరపాయి సమీపంలో కొండచరియలు విరిగిపడి రైల్వేట్రాక్‌పైకి మట్టి చేరిన ఘటనతో ఈ మార్గంలో ప్రయాణించే ప్రయాణికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అల్పపీడనం ప్రభావంతో రాయగడ జిల్లాకు ఎల్లో, రెడ్‌ అలర్ట్‌లు జారీ కాగా.. మూడు రోజుల్లో జిల్లాలో సుమారు 1,200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. అయితే కాసీపూర్‌, కల్యాణసింగుపూర్‌ ప్రాంతాల్లో భారీ వర్షాలు లేకపోయినా లెల్లిగుమ్మ, సికరపాయి తదితర ప్రాంతాల్లో కొండల నుంచి మట్టిజారి రైల్వే ట్రాక్‌పై పడటం, ట్రాక్‌ నీటిలో మునిగిపోవడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. గతంలో జూలైలో కాసీపూర్‌ సమితిలో కేవలం 69.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన సమయంలోనూ టికిరి రైల్వేస్టేషన్‌ సమీపంలో కొండలనుంచి వచ్చిన నీటితో రైల్వేలైను మునిగిపోయింది. రౌలి ప్రాంతంలోనూ ఇదే పరిస్థితి ఏర్పడింది. దీంతో వర్షాకాలంలో కేఆర్‌ లైన్‌ భద్రతపై చర్చ జరుగుతోంది. కేఆర్‌ లైన్‌ పరిధిలో అడవుల నరికివేత, పోడు వ్యవసాయం పెరుగుదల కారణంగా వర్షపునీరు నేలలోకి ఇంకకుండా వేగంగా దిగువ ప్రాంతాలకు ప్రవహిస్తోందని పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు. దీంతో కొండ ప్రాంతాల్లో మట్టి కోతకు గురై రైల్వే ట్రాక్‌లపైకి చేరే ప్రమాదం పెరుగుతోందని పేర్కొంటున్నారు.

ఖనిజ రవాణాకు కీలకం

రాయగడ రైల్వే డివిజన్‌ పరిధిలో సుమారు 165 కిలోమీటర్ల మేర ఉన్న ఈ మార్గం ఖనిజాల రవాణాతో పాటు సామాజిక, ఆర్థిక అభివృద్ధికి కీలకమైనదిగా ఉంది. అయితే వర్షాకాలంలో కొండచరియల ప్రమాదాలు పెరుగుతుండడంతో ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది. ఇదిలాఉండగా కేఆర్‌ లైన్‌ రెండు రైల్వేమార్గం నిర్మాణ పనులు కూడా కొండ ప్రాంతాల్లో వేగంగా కొనసాగుతున్నాయి. ఆధునిక యంత్రాలు, పేలుడు పదార్థాలతో జరుగుతున్న నిర్మాణ పనుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో కొండలు, మట్టి పొరలు బలహీనపడే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. కెవుటిగుడ టన్నల్‌ నంబర్‌ 29, లెల్లిగుమ్మ సింగారం, భలుమస్కా తదితర ప్రాంతాలను రైల్వేశాఖ సున్నిత ప్రాంతాలుగా గుర్తించినట్లు సమాచారం. ప్రస్తుతం రెండోలైన్‌ నిర్మాణ పనుల్లో 60 శాతానికి పైగా పూర్తయ్యాయి. రెండోలైన్‌లో మొత్తం 32 టన్నెళ్లు నిర్మించనున్నారు. టికిరి, భలుమస్కా మధ్య 19, భలుమస్కా– సింగాపూర్‌ రోడ్డు మధ్య 4 టన్నెళ్లు నిర్మాణంలో ఉన్నాయి. పర్వత ప్రాంతాల్లో పనులు కొనసాగుతున్న నేపథ్యంలో వర్షాకాలంలో భద్రతా చర్యలను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని ప్రయాణికులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement