జయపురం: జయపురం సబ్‌డివిజన్ బొరిగుమ్మ సమితి శొశాహండి గ్రామ పంచాయతీని సారా రహిత గ్రామంగా తీర్చుతామని ప్రతిణబూణారు. వందలాది మంది మహిళలు కర్రలు చేత పట్టి సారాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొట్‌పాడ్ మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర మఝి నేతృత్వంలో బొరిగుమ్మ సమితి కార్యాలయం ముంగిట బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో భారీగా మహిళలు పాల్గొని సారాకు వ్యతిరేకరంగా నినాదాలు చేశారు. మహిళలు అనేకసార్లు అధికారులను కలిసి తమ పంచాయతీ పరిధిలోని గ్రామాలలో పూర్తిగా సారా అమ్మకాలను బంద్ చేయాలని విన్న వించుకున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మహిళలు మండిపడ్డారు. అందుచేత మరో మార్గం లేక ఆంధోళనకు దిగినట్లు కొట్‌పాడ్ మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర మఝి వెల్లడించారు. తమ గ్రామంలో మద్మం అమ్మకూడదు, అమ్మితే తాము ఊరుకోమని మహిళలు నినాదాలు చేశారు. గ్రామాలలో వ్యవసాయం చేసుకొనే రైతుల మధ్య సారా అమ్ముతుండడంతో వారంతా మద్యానికి బానిసలవుతున్నారన్నారు. అందువలన గ్రామ పరిసరాలు వాతావరణం కలుషిత మౌతున్నాయని ఆరోపించారు. సారా తాగి పురుషులు ఇళ్లలో గొడవలు చేయటం వలన కుటుంబాల మధ్య అశాంతి నెలకొంటున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే మహిళలు గ్రామాలలో డప్పు కొట్టి సారా అమ్మకాలను నిలిపి వేయాలని ఏ ఒక్కరూ సారా తాగకూడదని చాటింపు వేశారు. గ్రామాలలో మద్యం దుకాణాలు ఎత్తి వేయాలని వ్యాపారులను హెచ్చరించారని.. అయినా ఫలితం లేక పోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అబకారీ, పోలీసు అధికారులకు, తహసీల్దార్లకు ఎన్నివిజ్ఞప్తులు చేసినా ఫలితం లేక పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుచేత ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమౌతున్నామన్నారు. ముందుగా అమరణ నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు. మద్య నిషేద ఉద్యమానికి తాను పూర్తిగా మద్దతునిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర మఝి వెల్లడించారు.


