భువనేశ్వర్: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ వ్యవహారాల ఇన్‌చార్జిగా ఒడిశాకు కొత్త ఇన్‌చార్జిగా డి.పురందేశ్వరి నియమితులయ్యారు. ఆమెతో సహ ఇన్‌చార్జిగా స్వదేశ్ సింగ్‌ని నియమించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీనియర్ బీజేపీ నాయకురాలు డి.పురందేశ్వరి 2020లో ఒడిశా బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వహించారు. రాష్ట్రంలో జరగనున్న పంచాయతీ, పట్టణ సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆమె పునః నియామకం ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యవహారాల బాధ్యతలు నిర్వహించిన విజయ్ పాల్ సింగ్ తోమర్, లతా ఉసెండీ స్థానంలో వరుసగా డి.పురందరేశ్వరి, స్వదేశ్ సింగ్ నియమితులయ్యారు.
సచివాలయం ముట్టడి
శ్రీకాకుళం రూరల్: మండలంలోని కల్లేపల్లి పంచాయతీ పరిధి పెద్దవీధి, పల్లెవీధులకు గత కొద్దిరోజులుగా విద్యుత్ పంపిణీ సక్రమంగా జరగడం లేదు. దీంతో గ్రామస్తులంతా కలిసి బుధవారం సచివాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం విద్యుత్ అంతరాయంపై పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం అందించారు.
ఆయన కళ్లు సజీవం
శ్రీకాకుళం కల్చరల్: శ్రీకాకుళం పట్టణంలోని మంగువారితోటకి చెందిన పిల్లల సతీష్ (41) బుధవారం మృతి చెందారు. దీంతో ఆయన నేత్రాలను కుటుంబ సభ్యులు దానం చేశారు. అతని భార్య హరిత, అన్నయ్య రాజేష్‌లు అంగీకరించి నేత్రసేకరణ కేంద్రంకు తెలిపారు. దీంతో మరో ఇద్దరి అంధుల జీవితాల్లో వెలుగు నింపే ఈ మహోన్నత సేవకు ముందుకు రావడం అభినందనీయమని ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ పి.జగన్మోహనరావు కొనియాడారు. జిల్లా రెడ్‌క్రాస్ సమన్వయంతో మగటపల్లి కల్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం ఐ టెక్నీషియన్లు పూతి సుజాత, బి.మనుకుమార్ మృతదేహం నుంచి కార్నియాలను విజయవంతంగా సేకరించి, వాటిని ఎల్.వి.ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ నేత్ర సేకరణ కేంద్రానికి తరలించారు. నేత్రదానం చేయాలనుకునేవారు 78426 99321, 94404 90525 నంబర్లను సంప్రదించవచ్చన్నారు.
అదృశ్యమైన వ్యక్తి మృతి
ఎల్.ఎన్.పేట: మండలంలోని ధనుకువాడకు చెందిన చిన్నాల విశ్వనాథం మృతదేహం యంబరాం రోడ్డు సమీపంలో వైన్‌షాపు పక్కన పొదల్లో బుధవారం స్థానికులు గుర్తించారు. విషయం తెలుసుకున్న సరుబుజ్జిలి ఎస్‌ఐ ఎస్.చిరంజీవి ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. ఈనెల 20 నుంచి తన భర్త విశ్వనాథం కనిపించడం లేదని భార్య శారద సరుబుజ్జిలి పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేసిన విషయం విధితమే. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. విశ్వనాథం మృతి చెందడంలో ధనుకువాడ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్యతో పాటు కుమార్తెలు సుమతి, సాయికుమారి ఉన్నారు.
ప్రపంచ శాంతికి మనమే మార్గదర్శకులం
ఎచ్చెర్ల: భారతీయ తాత్వికచింతనే ప్రపంచ శాంతికి ఏకై క మార్గమని విశ్వ హిందూ పరిషత్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. ప్రపంచంలో నెలకొన్న అసమానతలు రూపుమాపడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్థానిక బీఆర్‌ఏయూలో శాంతి – భిన్న సంస్కృతుల సంప్రదాయాలు అన్న అంశంపై బుధవారం ప్రారంభమైన అంతర్జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గోవాలోని ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఆర్.వెంకట్రావు మాట్లాడుతూ.. ప్రతి మనిషి న్యాయబద్ధంగా వ్యవహరించినప్పుడే శాంతి సాధ్యమవుతుందని చెప్పారు. బీఆర్‌ఏయూ వీసీ మాట్లాడుతూ.. ప్రపంచంలోని అన్ని మతాలు శాంతినే ప్రభోదిస్తున్నాయని పేర్కొన్నారు. అసమానతలు లేని సమాజం కోసం ప్రపంచ దేశాలన్నీ పాటుపడాలని కేంద్ర విద్యాశాఖ మెంబర్ సెక్రటరీ ప్రొఫెసర్ సచ్చిదానంద మిశ్రా కోరారు. నాణ్యమైన విద్య ద్వారానే విభిన్న సంస్కృతులు అర్థం చేసుకోగలమని చెప్పారు. రొమేనీయాకు చెందిన ప్రొఫెసర్ ఇవాన్ డుర వర్చువల్ గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


