అధికారులు అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

అధికారులు అప్రమత్తంగా ఉండాలి

Sep 24 2026 2:48 AM | Updated on Sep 24 2026 2:48 AM

కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: తీవ్ర వాయుగుండం ముప్పు నేపథ్యంలో జిల్లాలోని తీరప్రాంత మండలాల అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆదేశించారు. బుధవారం రాత్రి ఆయన ఎచ్చెర్ల, రణస్థలం, గార, పోలాకి, సంతబొమ్మాళి మండలాల ఆర్డీవోలు, తహసీల్దా ర్లు, ఎంపీడీవోలు, పోలీసు తదితర శాఖల అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత గాలుల వేగం గంటకు 48 నుంచి 50 కిలోమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉందన్నారు. రేకుల ఇళ్లు, కచ్చా ఇళ్లలో నివసిస్తున్న ప్రజలను తక్షణమే పునరావాస కేంద్రాలకు తరలించాల ని సూచించారు. విద్యుత్‌, ఇతర అత్యవసర సేవలకు అంతరా యం ఏర్పడితే సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరించాలని ఆదేశించారు.

చికిత్స పొందుతూ మహిళ మృతి

కవిటి: మండలంలోని బసవకొత్తూరులో ఈనెల 5వ తేదీన జరిగిన గ్యాస్‌ సిలిండర్‌ లీకేజీతో ఎగసిన మంటల్లో గాయపడిన పిట్ట కుమారి అనే మహిళ మంగళవారం రాత్రి రాగోలు జెమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందూతు మృతి చెందినట్లు కవిటి ఎస్‌ఐ వి.రవివర్మ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత పిట్ట కుమారిని శ్రీకాకుళం కిమ్స్‌ ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం రాగోలు తరలించి చికిత్సను అందించారు. అయితే మంగళవారం రాత్రి ఆమె మరణించిందని వైద్యులు తెలిపారని పోలీసులు చెప్పారు. పిట్ట కుమారికి 2017లో వివాహం అయ్యింది. ఇద్దరు కుమారులు సంజయ్‌రెడ్డి, షణ్ముఖరావులు ఉన్నారు.

లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి

హిరమండలం: వంశధార లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వంశధార ఎస్‌ఈ రామచంద్రరావు సూచించారు. బుధవారం ఆయన వంశధార ప్రాజెక్టు కమిటీ చైర్మన్‌ రవీంద్రబాబుతో కలిసి గొట్ట బ్యారేజీని సందర్శించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా పడిన వర్షాలకు వస్తున్న వరద నీటిని పరిశీలించారు. వరద వివరాలు, ఒడిశా క్యాచ్‌మెంట్‌ ఏరియాలో పడిన వర్షపాతం నమోదు, ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలపై డీఈఈ సరస్వతిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం గొట్టా బ్యారేజీ వద్ద 19 వేలు క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉందని, కుడి, ఎడమ కాలువలను ఆపివేసి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా బయటకు విడిచిపెడుతున్నామన్నారు. మరో రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రస్తుతానికి 35 వేల క్యూసెక్కుల నీరు రావొచ్చునని అంచనా వేస్తున్నామన్నారు. అందుకు తగ్గట్టుగా అధికారులు, సిబ్బందిని అప్రమత్తంగా చేశామన్నారు. ఎక్కడైనా ప్రమాదం సంభవించినట్లయితే తక్షణమే తమకు తెలియజేస్తే జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో యుద్ధ ప్రాతిపదికన మరమ్మతుల చేయడం జరుగుతుందన్నారు.

● పట్టాలపై తెల్లారిన బతుకులు

● రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్‌ రైలు ఢీకొని

నలుగురు ఇంటర్‌ విద్యార్థుల దుర్మరణం

● మరో యువకుడి పరిస్థితి విషమం

● మృతులంతా టెక్కలి గిరిజన వసతి

గృహ విద్యార్థులు

కొండకోనల్లో మగ్గిపోతున్న తమ జీవితాలకు కొత్త అర్థం వెతుక్కునే ప్రయత్నంలో ఉన్న విద్యార్థులను రైలు భూతం కబళించింది. కూలీల కుటుంబాలుగానే మిగిలిపోకుండా.. పిల్లలనైనా చదివించి వారికి ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలనుకున్న తల్లిదండ్రుల ఆశలను చిదిమేసింది. ఎక్కడో కుగ్రామాల నుంచి వచ్చి టెక్కలిలో ఇంటర్‌ చదువుకుంటున్న విద్యార్థులు బహిర్భూమికి వెళ్లి తిరిగి వస్తూ పట్టాలు దాటుతుండగానే వేగంగా దూసుకొచ్చిన రైలు నలుగురి జీవితాలను ఛిద్రం చేసి వెళ్లిపోయింది. కూలీల కుటుంబాల్లో చీకట్లు నింపింది. పట్టాలపైనే ఆశల దీపాలు ఆర్పివేసింది.

టెక్కలి/టెక్కలి రూరల్‌ :

రైలు ఢీకొని నలుగురు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. ఈ విషాదకర ఘటన బుధవారం టెక్కలి మండలం రావివలస సమీపంలో చోటుచేసుకుంది. ఇదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాల్మన్‌రాజు తెలిపిన వివరాల ప్రకారం.. . టెక్కలి మండలం డమర గ్రామానికి చెందిన జన్ని దిలీప్‌కుమార్‌(17), గంగువాడ విశాఖరావు(17), భీంపురం గ్రామానికి చెందిన జన్ని శరత్‌కుమార్‌(17), మెళియాపుట్టికి చెందిన సవర శివ(17), డమర గ్రామానికి చెందిన గంగువాడ సాల్మన్‌రాజు టెక్కలిలోని గిరిజన బాలుర వసతి గృహంలో ఉంటూ టెక్కలి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నారు. తీవ్ర వాయుగుండం నేపథ్యంలో కాలేజీకి సెలవు ప్రకటించడంతో బుధవారం మధ్యాహ్నం బహిర్భూమి కోసం రావివలస జంక్షన్‌ సమీపంలో కోనేరు వద్దకు వెళ్లారు. తిరిగి వస్తూ పట్టాలు దాటుతుండగా మధ్యాహ్నం 1.45 గంటల సమయంలో బర్మాకాలనీ–రావివలస సమీపంలో 4 నుంచి 5వ మైలురాయి మధ్యలో రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్‌ రైలు ఢీకొట్టింది. వర్షం జోరుగా పడుతుండటంతో రైలును గమనించకపోవడం వల్ల ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో దిలీప్‌కుమార్‌, శరత్‌కుమార్‌, విశాఖరావు, శివ అక్కడికక్కడే మృతిచెందారు. మరో యువకుడు సాల్మన్‌రాజు తీవ్రంగా గాయపడి ప్రస్తుతం రిమ్స్‌లో వైద్యం పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న ముఖలింగాపురం మాజీ సర్పంచ్‌ బందపల్లి రాకేష్‌, కవిటి చిన్నబాబు, రాజు తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ సంఘటనపై ప్రత్యేక దర్యాప్తు నిర్వహించి మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలనిగిరిజన సంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

ఘటనా స్థలాన్ని పరిశీలించిన అధికారులు..

ప్రమాద విషయం తెలుసుకున్న టెక్కలి ఆర్డీఓ ఎం.కృష్ణమూర్తి, తహసీల్దార్‌ వి.రాంబాబు, సీఐ ఎ.విజయకుమార్‌, ఎస్‌ఐ రాము, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. రైల్వే జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్‌, వైద్యాధికారులు, ఇతర విభాగాలకు చెందిన వారంతా సంఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీశారు. ఎస్పీ కే.వీ.మహేశ్వర్‌రెడ్డి, డీఎస్పీ డి.లక్ష్మణరావు ఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాల నుంచి వివరాలు సేకరించారు. మెడికల్‌ విభాగానికి చెందిన ఐసీఎఫ్‌ రైలులో మృతదేహాలను టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు సంతోష్‌, సుకన్య తదితరులు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆ సమయంలో తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అందరూ నిరుపేదలే..

దిలీప్‌కుమార్‌ తండ్రి రాజు, తల్లి సునీతలు టెక్కలిలో భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారు. శరత్‌కుమార్‌ తండ్రి కృష్ణారావు, తల్లి పెంటమ్మ వ్యవసాయ కూలీలుగా కుటుంబాన్ని పోషిస్తున్నారు. శివ తండ్రి కృష్ణారావు తాపీమేసీ్త్ర కాగా, తల్లి అను గృహిణి. విశాఖరావు తండ్రి నాగరాజు, తల్లి తేజమ్మ భవన నిర్మాణ కార్మికులు. వీరంతా నిరుపేద కుటుంబాలకు చెందిన వారే కావడంతో విషాదం నెలకొంది.

హారన్‌ వేయలేదా?

రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్‌ రైలు వేగంగా వచ్చే సమయంలో బర్మా కాలనీ సమీపంలో హెచ్చరికగా ఎటువంటి హారన్‌ వేయరని స్థానికులు చెబుతున్నారు. టెక్కలిలో హాల్టింగ్‌ లేకపోవడంతో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయని, రక్షణ చర్యలు కూడా లేవని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement