రాయగడ: రాష్ట్ర స్టాప్ సెలక్సన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ ) ద్వారా ఎంపికై న 185 మంది ఉపాధ్యాయులకు రాయగడ జిల్లాలోని వివిధ రెసిడెన్సియల్ పాఠశాలల్లో ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. వీరి విద్యార్హత, ఇతర ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ స్థానిక జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో ఈ మేరకు పూర్తయ్యింది. పరిశీలన అనంతరం మార్కుల ఆధారంగా మెరిట్ ప్రకారం పాఠశాలల ఎంపికకు అభ్యర్థులకు అవకాశం కల్పించనున్నారు. ఎంపికై న 185 మందిలో 159 మంది మెట్రిక్ సిటీ ఉపాధ్యాయులు, 11 మంది సౌర భాషా ఉపాధ్యాయులు, 15 మంది కుయి (కంధ) భాషా ఉపాధ్యాయులు ఉన్నారు. వీరిని ఎస్సీ, ఎస్టీ తెగల అభివృద్ధి (సంక్షేమ విభాగం) పరిధిలోని జిల్లాలోని 149 రెసిడెన్సియల్ పాఠశాలల్లో నియమించనున్నారు. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం పూర్తి నివేదికను పరిశీలిన కమిటీ జిల్లా కలెక్టర్‌కు సమర్పించనుంది. అనంతరం కలెక్టర్ ద్వారా నివేదికను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ శాఖకు పంపించారు. ఇప్పటికే ఈ ఏడాది జూన్‌లో 22 మంది, ఆగస్టు 16 మంది ఉపాధ్యాయులకు నియమకాలు లభించాయి. తాజా ఎంపిక ప్రక్రియతో కలిపి రాయగడ జిల్లాలో మొత్తం 223 మంది ఉపాధ్యాయులకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమశాఖ అధికారి ఆసీమా రావ్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల సర్టిఫికెట్ల పరిశీలన, పాఠశాలల ఎంపిక ప్రక్రియ పూర్తయ్యిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎంపికై న ఉపాధ్యాయులకు త్వరలో నియామక ఉత్తర్వులు జారీ కానున్నాయని పేర్కొన్నారు.


