భువనేశ్వర్: పూరీలో శ్రీ జగన్నాథుని రథ యాత్ర అంచెలంచెలుగా అంతిమ దశకు చేరుకుంటోంది. శ్రీ మహా లక్ష్మి మనస్తాపంతో వెను దిరిగిన మరునాటి నుంచి మారు రథ యాత్రకు సన్నాహాలు ఊపందుకున్నాయి. శ్రీ మందిరానికి వెళ్లేందుకు శారదా బాలిలో దక్షిణం వైపు మలుపు తిరిగి బహుడా యాత్రకు సిద్ధమయ్యాయి. రథాలు సిద్ధం కావవడంతో శ్రీ గుండిచా మందిరం జన్మ వేదికపై స్వామిని కడసారి దర్శించుకునేందుకు భక్తులు, యాత్రికులు తండోపతండాలుగా తరలి వచ్చారు. గురువారం సాయంత్రం శ్రీ గుండిచా మందిరంలో సాధారణ భక్తులకు దర్శనం నిలిపి వేశారు.
నేడు మారు రథయాత్ర
శుక్రవారం స్వామి మారు రథ యాత్రలో శ్రీ మందిరం వైపు బయల్దేరనున్నాడు. దారిలో పిన్నమ్మ ఇంటి ముంగిట కాసేపు ఆగి మిఠాయి ఆరగించి తీరిగ్గా ముందుకు సాగుతాడు. నల్లనయ్య కోసం పిన్నమ్మ ఇంటిలో పొడొ పిఠా సంప్రదాయ వంటకం సిద్ధం అవుతుంది. బహుదా యాత్ర రోజున, ఆయన సోదర సోదరీ సమేతంగా శ్రీ జగన్నాథుడు శ్రీ మందిరానికి తిరిగి వస్తున్నప్పుడు మార్గ మధ్యంలో మౌసి మా ఆలయం ఆవరణలో ఈ విశిష్టమైన పిండి వంటకం పొడొ పిఠాను సమర్పిస్తారు. నిత్యం వినియోగించే పొడొ పిఠా తరహాలో కూడా స్వామి కోసం పొడొ పిఠా ప్రత్యేక శైలిలో తయారు చేయడం విశేషం. సాధారణ పొడొ పిఠాని అవసరమైన మిశ్రమాలతో పొయ్యి నిప్పులపై కాల్చుతారు.
స్వామి కోసం పొడొ పిఠా కాల్చడానికి బదులుగా శుద్ధమైన నెయ్యిలో వేయించడం విభిన్నత. కాల్చిన పదార్థాలు భగవంతునికి నివేదించడం ఆమోదయోగ్యం కాదనే ఆచారంతో నేతిలో వేయించి శ్రీ జగన్నాథునికి పిన్నమ్మ సమర్పిస్తుంది.


