భక్తుల వద్దకే భగవంతుడు | - | Sakshi
Sakshi News home page

భక్తుల వద్దకే భగవంతుడు

Jul 17 2026 7:15 AM | Updated on Jul 17 2026 7:15 AM

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా రథయాత్ర

మల్కన్‌గిరి: జిల్లా కేంద్రంలో గురువారం జగన్నాథ స్వామి రథయాత్రను కలెక్టర్‌ ప్రథమేశ్‌ అర్వింద్‌ రాజాశిర్కే చేతులమీదుగా సాంప్రదాయ పూజ అనంతరం ప్రారంభించారు. ముందుగా సాయంత్రం 4 గంటల సమయంలో రథంపై కలెక్టర్‌ ప్రథమేశ్‌ చేత ప్రత్యేక పూజలు, చెరా పహార నిర్వహించి యాత్రకు శ్రీకారం చుట్టారు. భక్తుల సౌకర్యార్థం పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

కొరాపుట్‌లో...

కుంభవృష్టి వర్షం మధ్య కొరాపుట్‌, నబరంగ్‌పూర్‌ జిల్లాల్లో రథయాత్ర జరిగింది. ఉదయం నుంచి భారీవర్షం పడుతున్నప్పటికీ ప్రజలు రథాలను జగన్నాథ మందిరం నుంచి గుండిచా మందిరాల వరకు తోడ్కొని వెళ్లారు. దక్షిణ ఒడిశా పూరీక్షేత్రంగా పేరుగాంచిన కొరాపుట్‌ శబరి శ్రీక్షేత్రంలో జగన్నాథ, సుభద్ర, బలభద్ర రథాలు లక్ష్యం చేరుకున్నాయి.

రాయగడలో...

రథయాత్ర వేడుకలు రాయగడలో ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక జగన్నాథ మందిరం నుంచి జగన్నాథ, బలభద్ర, సుభద్ర దేవతామూర్తులను మధ్యాహ్నం 12 గంటల నుంచి పొహోండి ద్వారా రథంపైకి సేవకులు, భక్తులు ఎక్కించారు. అనంతరం 4 గంటలకు రథాన్ని లాగే కార్యక్రమం చేపట్టారు. కలెక్టర్‌ అశుతోష్‌ కులకర్ణి, తహసీల్దార్‌ ప్రియదర్శిని స్వయ్‌ల పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో కొరాపుట్‌ ఎంపీ సప్తగిరి శంకర్‌ ఉలక దంపతులు, రాయగడ ఎమ్మెల్యే అప్పలస్వామి కడ్రక, బీజేపీ నాయకుడు యాళ్ల కొండబాబు, ఎస్‌డీసీ వైస్‌ చైర్‌పర్సన్‌ మంజుల మినియాక తదితరులు పాల్గొన్నారు.

పర్లాకిమిడిలో...

పర్లాకిమిడిలో రథయాత్ర సందర్భంగా తొలుత బలభద్రుడిని మందిరం నుంచి బయటకు తీసుకొచ్చి పొహోండి జరిపారు. అనంతరం సుభద్ర దేవి, చివరగా జగన్నాథుని పొహోండి జరిపి రథాలపై ఎక్కించారు. సేవాయత్‌లు, పండితుల శాస్త్రోక్తంగా మంత్రోచ్చరణ, పూజలు అనంతరం గజపతి వంశీయుల యువరాణి కల్యాణీ దేవి గజపతి విచ్చేసి జగన్నాథ స్వామి రథంపై పూజలు జరిపి బంగారు చీపురుతో శుభ్రం చేశారు. పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్‌ పాణిగ్రాహి విచ్చేసి జగన్నాథ, బలభద్ర, సుభద్ర దేవుళ్లను రథాలపై ఎక్కించడానికి సహాయపడ్డారు. సాయంత్రం మూడు రథాలను గుండిచా మందిరం వైపు భక్తులు లాగారు. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

జయపురంలో రథయాత్ర నేడు

జయపురం: పట్టణంలో జగన్నాథుని రథయాత్ర శుక్రవారం జరుగుతుంది. గురువారం జగన్నాథ మందిరం నుంచి జగన్నాథుడు, బలభద్ర, సుభద్ర దేవతామూర్తులను భక్తిశ్రద్ధలతో రఘునాథ్‌ మందిర కూడలి వద్దనున్న నూతన రథం వరకు సేవాయత్‌లు తోడ్కొని వచ్చి రథంపై ఆసీనులను చేశారు. మార్గమధ్యలో ప్రజలు దేవతామూర్తులకు ఫలపుష్పాలు, భోగాలతో పూజలు చేశారు. దేవతామూర్తులను రథంపైకి తీసుకెళ్తున్న సమయంలో వేలాది మంది భక్తులు కనుల పండువగా తిలకించారు. గురువారం రాత్రంతా భక్తులు పూజలు చేస్తారు. శుక్రవారం మధ్యాహ్నం రథాలను గుండిచా మందిరం వరకు తీసుకెళ్తారు. ఎన్నో ఏళ్లుగా ఇదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. కాగా గురువారం జయపురం పూర్ణఘడ్‌లో రథయాత్ర జరిగింది.

రథయాత్ర శుభాకాంక్షలు

భువనేశ్వర్‌: పవిత్ర రథయాత్ర రథయాత్ర సందర్భంగా దేశ ప్రజలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలు శుభాకాంక్షలు తెలిపారు. ఇది భారతదేశపు శాశ్వతమైన ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వానికి ఒక ప్రకాశవంతమైన వ్యక్తీకరణగా అభివర్ణించారు. అలాగే రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ హరిబాబు కంభంపాటి, ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝీ, విపక్ష నేత నవీన్‌ పట్నాయక్‌ రాష్ట్ర ప్రజలకు రథయాత్ర శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement