రాయగడ: పట్టణంలో గురువారం అర్ధరాత్రి టైల్స్ కట్టింగ్ మెషిన్‌ను తిరిగి ఇవ్వడంపై జరిగిన వివాదం తీవ్రరూపం దాల్చింది. దీంతో ఒక యువకుడిపై కత్తితో దాడి చేసిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యువకుడిని స్థానిక జిల్లా ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఈ ఘటనలో గాయపడిన యువకుడు బీహార్ రాష్ట్రానికి చెందిన ఎండీ సర్పరాజ్‌గా గుర్తించారు. స్థానిక కస్తూరీనగర్‌లో బీహార్ రాష్ట్రంలోని బేలా ప్రాంతానికి చెందిన కొందరు యువకులు టైల్స్‌పనులు చేస్తూ ఇక్కడ నివాసముంటున్నారు. ఈ క్రమంలో సర్పరాజ్‌కు చెందిన టైల్స్‌కటింగ్ మెషిన్‌ను అతని పొరుగువాడు ఎండీ సయ్యద్ తీసుకుని వెళ్లి తిరిగి ఇవ్వలేదని సమాచారం. ఈ విషయమై కొంత కాలంగా ఇద్దరి మధ్య వివాదం కొనసాగుతుంది. అయితే గురువారం రాత్రి ఇదే అంశంపై మళ్లీ ఇద్దరి మధ్య వాగ్వావాదం చోటు చేసుకొని చినికిచినికి గాలివానలా మారింది. ఆగ్రహానికి గురైన సయ్యద్ కత్తితో సర్పరాజ్‌పై దాడి చేసాడు. దాడిలో సర్పరాజ్ శరీరంలోని పలు భాగాల్లో తీవ్రగాయాలు కావడంతో అతని సహచరులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. వైద్యం అందించిన డాక్టర్లు ప్రస్తుతం అతని పరిస్థితి స్తిమితంగా ఉందని వివరించారు. ఘటనపై సమాచారం తెలుసుకున్న సదరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. కేసు నమోదు చేసి దాడికి దారితీసిన పరిస్తితులను, నిందితుడి పాత్రపై దర్యాప్తు చేపట్టారు. అయితే దాడికి పాల్పడిన నిందితుడు పరారీలో ఉన్నట్లు సమాచారం.
అంబులెన్స్ రాక రోడ్డు
ప్రమాద బాధితుడి మృతి
రాయగడ: రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఒక యువకుడు సమయానికి అంబులెన్స్ రాక వైద్యం అందక చనిపోయాడు. మృతుడిని జిల్లాలోని కల్యాణసింగుపూర్ సమితి పరిధిలొని భలుమస్క గ్రామానికి చెందిన అరుణ్ ప్రస్కా (24) గా గుర్తించారు. స్నేహితుడు పుట్టన రోజు వేడుకల్లొ పాల్గొనేందుకు అరుణ్ రాయగడకు గురువారం నాడు వచ్చాడు. కార్యక్రమం ముగిసిన మీదట స్వగ్రామానికి తిరిగి వెళుతున్న సమయంలో రొడ్డు ప్రమాదానికి గురయ్యాడు. స్థానిక రైతుల కాలనీ ప్రాంతంలొ జరిగిన ఈ ప్రమాదంలో తీవ్రగాయాలకు గురైన అరుణ్ రోడ్డు అచేతనంగా పడి ఉన్నాడు. అక్కడి వారు కొంతమంది ఆటోలో అతడిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి బరంపురం తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. అయితే రాత్రి సమయంలో 108 అంబులెన్స్ సేవలు అందుబాటులో లేకపోవడంతో ఆస్పత్రి నిర్వాహకులను సంప్రదించినప్పటికీ సరైన సహకారం లభించలేదని కుటుంబీకులు ఆరోపించారు. అంబులెన్స్ సౌకర్యం లేకపోవడం, చికిత్సలో ఆలస్యం జరగడం వల్లే అరుణ్ మృతి చెందాడని బంధువులు ఆరోపించారు.
నీటి సమస్యపై మహిళల ఆందోళన
రాయగడ: తాగునీటి సమస్యను పరిష్కరించడంలో అధికారుల నిర్లక్ష్యవైఖరి ప్రదర్శించినందుకు నిరసనగా మహిళలు శుక్రవారం ఆందోళన చేపట్టారు. సదరు సమితి కుంభికోట మెయిన్ రోడ్డుపై వారంతా ఖాళీ బిందెలు పట్టుకుని రోడ్డుపై బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేశారు. కొద్ది నెలలుగా గ్రామంలో మంచినీటి సమస్య విలయ తాండవం చేస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని మహిళలు ఆరోపించారు. సుమారు 100 కుటుంబాలకు పైబడి ఉన్న గ్రామంలో ఉన్న మూడు గొట్టపు బావులు మరమ్మతులకు గురయ్యాయని.. ఈ విషయాన్ని పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఎటువంటి ఫలితం లేకపొవడంతో గ త్యంతరం లేక ఆందోళనకు దిగామని మహిళలు పేర్కొన్నారు. కుంభికోట రహదారిపై మహిళలు బైఠాయించడంతో ఆ మార్గంలో రాకపొకలు నిలిచిపోయాయి. దీంతో రాయగడ నుంచి కొరాపుట్, జయపురం, మల్కన్‌గిరి వంటి ప్రాంతాలకు వెళ్లే వాహనాలు రోడ్డుపై బారులు తీరాయి. సమాచారం తెలుసుకున్న అధికారులు ఆందోళనకారులతో మాట్లాడారు. వారం రోజుల్లో తాగునీటి సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని, అంతవరకు ట్యాంకర్ల ద్వారా నీరి స్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు.


