రాయగడ: జిల్లాలోని జేకేపూర్ ఉన్న జేకే పేపర్ మిల్స్ సంస్థకు కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) కార్యక్రమాల్లో విశిష్ట సేవలకు గ్రీన్‌టెక్ సీఎస్‌ఆర్ ఇండియా గోల్డ్ అవార్డు–2026 లభించింది. దివ్యాంగుల సంక్షేమం విభాగంలో ఈ ప్రతిష్టాత్మక అవార్డును న్యూఢిల్లీలో ఈ నెల 13వ తేదీన నిర్వహించిన గ్రీన్‌టెక్ సీఎస్‌ఆర్ ఇండియా అవార్డు–2026 కార్యక్రమంలో ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారిత శాఖ సహాయ మంత్రి రామ్ దాస అథేవాలి ముఖ్యఅతిథిగా హాజరవ్వగా సంస్థ తరఫున స్మృతిరేఖ కర్ అవార్డును అందుకున్నారు. దివ్యాంగల సంక్షేమం కోసం సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా అవార్డు లభించడం విశేషం. జిల్లాలోని కాలనారలో జేకేపేపర్ మిల్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నూతన్‌న జ్ఞాన్ వర్ధిని ప్రత్యేక పాఠశాలలో మానసిక పిల్లలకు విద్య, ఫిజియోథెరఫీతో పాటు వ్యక్తిత్వ వివాస శిక్షణ అందిస్తున్నారు. ప్రస్తుతం సుమారు 50 మంది విద్యార్థులు ఈ సేవలను పొందుతున్నారు. ఈ ప్రాజెక్టును జిల్లా సామాజిక సంక్షేమ శాఖ సహకారంతో నిర్వహిస్తున్నారు. అలాగే దివ్యాంగ యువతలో క్రీడా ప్రతిభను ప్రోత్సాహించేందుకు కూడా సంస్థ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా పారా క్రీడాకారుడు ఎల్.రమేష్ కుమార్‌కు నిరంత ఆర్థిక సహాయం అందిస్తోంది. కరాటే, కుంగ్‌ఫూ, తైక్వాండో పోటీల్లో జపాన్, మలేషియా, శ్రీలంక వంటి దేశాల్లో పాల్గొన్న రమేష్ కుమార్ బ్లాక్ బెల్ట్ బెల్ట్ సాధించి అంతర్జాతీయ స్థాయిలో పలు బంగారు వెండి, కాంస్య పతకాలు గెలుచుకొని రాయగడకు గుర్తింపు తీసుకువచ్చారు. ఇటువంటి తరహా సీఎస్‌ఆర్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నందుకు గుర్తించి ఈ అవార్డు జేకేపేపర్ మిల్ సంస్థకు దక్కడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జేకేపేపర్ మిల్ యూనిట్ ఎగ్జిక్యూగివ్ వైస్ ప్రెసిడెంట్ (వర్క్స్) వినయ్ ద్వివేది, సంస్థ పీఆర్, సీఎస్‌ఆర్ బందాల కృషిని అభినందిస్తు భవిష్యత్‌లో కూడా సామాజికాభివృద్ధికి కట్టుబడి పనిచేయాలని ఆకాంక్షించారు.


