నాల్కో ఎదుట కాంగ్రెస్ ఆందోళన
కొరాపుట్: భారత ఆల్యూమినియ కేంద్రం (నాల్కో) ఎదుట కాంగ్రెస్ పార్టీ నాయకులు శనివారం ఆందోళన చేపట్టారు. కొరాపుట్ జిల్లా దమంజోడిలోని నాల్కో ప్రధాన ద్వారం ఎదుట ఆందోళన నిర్వహించారు. రాష్ట్ర సీఎల్‌పీ నాయకుడు, పొట్టంగి ఎమ్మెల్యే రామచంద్ర ఖడం మాట్లాడుతూ.. నాల్కో యాజమాన్య వైఖరిపై మండి పడ్డారు. ఇక్కడ నాల్కో పరిశ్రమ ఏర్పాటు కోసం వందలాది కుటుంబాలు నిర్వాసితులుగా మారారని.. అయితే వారిని నేటి వరకు ఆదుకోలేదన్నారు. ఇక్కడ యువతకి ఉపాధి లభిస్తుందనే లక్ష్యంతో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ దీన్ని ప్రారంభించారన్నారు. కానీ నాల్కో మాత్రం నిర్వాసితులకు నేటి వరకు ఉపాధి కల్పించలేదన్నారు. ఇక్కడ ప్రజలకు చెందిన వనరులను నాల్కో తరలించుకుపోతుందని రాం చంద్ర ఆగ్రహవేశం వ్యక్తం చేశారు. ఆందోళనలో లక్ష్మీపూర్ ఎమ్మెల్యే పవిత్ర శాంత, మాజీ ఎమ్మెల్యే నిమయ్ సర్కార్ తదితరులు పాల్గొన్నారు.


