‘ఉపాధి’లో గాంధీ పేరు తొలగించడం అన్యాయం
రాయగడ: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరును తొలగించడంపై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈమేరకు బుధవారం రాయగడలో ఆ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. డీసీసీ అధ్యక్షుడు, రాయగడ ఎమ్మెల్యే అప్పల స్వామి కడ్రక నేతృత్వంలో ఆ పార్టీ సీనియర్ నాయకులు దుర్గా ప్రసాద్ పండ, శంకర్షన్ మంగరాజ్, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్థానిక సర్క్యూట్ హౌస్ నుంచి ర్యాలీగా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ నవీన్ చంద్ర నాయక్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కడ్రక మాట్లాడుతూ.. గ్రామీణ భద్రతకు మూల స్తంభంగా ఉన్న మనోరేగ పథకం ప్రజలకు అందుబాటులో ఉండేదని అన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం పథకంలో గాంధీ పేరును తొలగించి రామ్ రామ్ జీగా మార్చడం విచారకరమని అన్నారు. ప్రభుత్వం స్పందించి మనోరేగ పథకాన్ని యథాస్థితిగా మార్చాలని.. లేని పక్షంలో కాంగ్రెస్ భవిష్యత్‌లో ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తుందని అన్నారు.
‘ఉపాధి’లో గాంధీ పేరు తొలగించడం అన్యాయం


