రైల్వేలైన్ నిర్మాణం ఇంకెన్నడు..?
కొరాపుట్: నబరంగ్‌పూర్ జిల్లాలో రైల్వేలైన్ నిర్మాణంపై ప్రతిపక్ష బీజేడీకి చెందిన రాజ్యసభ ఎంపీ, ఒడియా సినీ హీరో మున్నా ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం పార్లమెంట్‌లో ఈ సమస్యను లేవనెత్తారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్ని దశాబ్ధాలు అయినప్పటికీ నబరంగ్‌పూర్ జిల్లాలో రైల్వేలైన్ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2016లో అప్పటి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కేంద్ర ప్రభుత్వంతో ఏంవోయూ కుదిర్చుకున్నట్లు గుర్తు చేశారు. జయపూర్ – నబరంగ్‌పూర్‌ల మధ్య మొత్తం కి.మీ.40 దూరం భూ సేకరణ మెత్తం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని, అంతేకాక రైల్వేలైన్ నిర్మాణంలో సగం ఖర్చులు భరించడానికి నవీన్ పట్నాయక్ అంగీకరించారని తెలిపారు. అప్పడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే ఉందన్నారు. నాటి రైల్వే మంత్రి సురేష్ ప్రభు, రాష్ట్రానికి చెందిన ఒకే ఒక బీజేపీ ఎంపీ జుయల్ ఓరం, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ఎంవోయూ సమయంలో ఉన్నారని పేర్కొన్నారు. ఇప్పటికి పదేళ్లు అయినా నిర్మాణానికి చర్యలు తీసుకోలేదని వాపోయారు. ప్రస్తుత కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్టవ్ బీజేపీ సాయంతో రాజ్యసభ ఎంపీ కాలేదని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా తమ నాయకుడు నవీన్ ఆదేశాలతో బీజేడీ మద్దతుతో ఎంపీ అయ్యారని గుర్తు చేశారు. అలాంటిది కేవలం 40కి.మీ రైల్వేలైన్ పూర్తి చేయలేరా అని ధ్వజమెత్తారు.
రాజ్యసభలో ప్రభుత్వంపై విమర్శలు


