విలువలతో కూడిన విద్య అందించాలి
పర్లాకిమిడి: పట్టణంలోని శివార్లలో ఉన్న అరవింద పూర్ణాంగ శిక్షణ కేంద్ర విద్యాలయ 27వ వార్షికోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ ఉత్సవానికి ముఖ్యఅతిథిగా జిల్లా ముఖ్య శిక్షణాధికారి మయాధర్ సాహు, విశ్రాంత న్యాయాలయ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేష్ కుమార్ మిశ్రా, బ్యాంకు విశ్రాంత ఉద్యోగి విశ్వనాథ పాణిగ్రాహి, జిల్లా సైన్స్ కోఆర్డినేటరు అంపోలు రవికుమార్ తదితరులు పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజేష్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ.. అరవింద పూర్ణాంగ శిక్షణ కేంద్రంలో చదివిన విద్యార్థులు మన సంస్కృతితో పాటు విలువలతో కూడిన విద్యను అభ్యసిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా వివిధ ఆటల పోటీలు, వక్తృత్వ, డ్యాన్సు పోటీల్లో విజేతలకు బహుమతులను రాజేష్ కుమార్ మిశ్రా అందజేశారు. అరవింద పూర్ణాంగ విద్యాలయం అధ్యక్షుడు గీతాంజలి దాస్ అతిథులను పరిచయం చేశారు. విద్యాలయం కమిటీ అధ్యక్షుదు రవీంద్రనాథ్ పాడీ వార్షిక పట్టికను చదివారు. అతిథులకు గౌరవ పురాస్కారాలను విద్యాలయం కమిటీ సభ్యులు అందజేశారు. బిజయ కుమార్ మున్ని సభికులకు ధన్యవాదాలు తెలిపారు.


