పంచాయతీ సభ్యత్వానికి ఇద్దరు బిడ్డల సంతానం ముద్దు: హైకోర
భువనేశ్వర్: పంచాయతీ సభ్యత్వానికి ఇద్దరు బిడ్డలు ముద్దు.. అంతకు పైబడిన సంతానం వద్దు అని రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో లోగడ ఏక సభ్య ధర్మాసనం జారీ చేసిన ఉత్తర్వుల్ని ద్విసభ్య ధర్మాసనం గట్టిగా సమర్థించింది. పరిమిత సంతానం జనాభా నియంత్రణ యొక్క రాజ్యాంగ, సామాజిక ప్రాముఖ్యతను పునరుద్ఘాటిస్తుంది. ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉన్న ఆరోపణతో పదవి కోల్పోయిన మాజీ గ్రామ పంచాయతీ సభ్యుడు దాఖలు చేసిన అప్పీల్ విచారణ పురస్కరించుకుని ఉన్నత న్యాయ స్థానం ఈ అభిప్రాయం వ్యక్తం చేసింది. జస్టిస్ కృష్ణ శ్రీపాద దీక్షిత్, చిత్తరంజన్ దాష్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఒడిశా గ్రామ పంచాయతీల చట్టం, 1964లోని సెక్షన్ 25(1)(5) ప్రకారం అప్పీలుదారుడి సభ్యత్వాన్ని రద్దు చేయడాన్ని సమర్థించింది. ఈ నిబంధన 2 మంది కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న వ్యక్తులను పంచాయతీ రాజ్ సంస్థలలో పదవులు నిర్వహించడానికి అనర్హులుగా పేర్కొంటుందని వివరించారు. మాజీ గ్రామ పంచాయతీ సభ్యుడు అనర్హతను సవాలు చేస్తూ దాఖలు చేసిన రిట్‌లోగడ ఏకసభ్య ధర్మాసనం పిటిషన్లను తోసిపుచ్చింది. 2025 డిసెంబర్ 5న ఈ మేరకు తీర్పు జారీ చేసింది.
ఇద్దరు పిల్లల నిబంధన అమలుకు ముందు అప్పీలు దారుణానికి మూడు, నాల్గో సంతానం క్రమంగా 1993, 1994లో జన్మించారని పేర్కొంటూ అనర్హత నిబంధన నిబంధన కింద తనకు రక్షణ కల్పించాలని అప్పీలుదారు అభ్యర్థించాడు. ద్విసభ్య ధర్మాసనం ఆ అభ్యర్థనను తోసిపుచ్చింది. ఇద్దరు పిల్లల నియమాన్ని ప్రవేశపెట్టే చట్టబద్ధమైన సవరణ 1994 ఏప్రిల్ 18 నుంచి అమల్లోకి వచ్చిందని పేర్కొంది. సవరణ అమలులోకి వచ్చిన తర్వాత అప్పీలుదారు అనుమతించదగిన పరిమితిని మించిపోయాడని కోర్టు గమనించింది. చట్టపరమైన సవరణ ప్రారంభించే సమయంలో లేదా ఆ తర్వాత ఒక సంవత్సరం లోపు ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉన్న వ్యక్తులకు మాత్రమే వెసులుబాటు వర్తిస్తుందని ధర్మాసనం పేర్కొంది. ఈ నేపథ్యంలో అప్పీలుదారు ఈ షరతులను పాటించనందున అతడి అనర్హతను తోసిపుచ్చలేమని ధర్మాసనం నిర్ధారించింది. ముఖ్యంగా అట్టడుగు స్థాయిలో ఎన్నికై న ప్రజా ప్రతినిధులు కుటుంబ నియంత్రణ నిబంధనలను పాటించడంలో ఆదర్శంగా నిలవాలని ధర్మాసనం నొక్కి చెప్పింది. వారే స్వయంగా నియమాన్ని ఉల్లంఘిస్తే, వారు ప్రజల ముందు ఏ ఉదాహరణను ఉంచగలరు?‘ అని ఏక సభ్య ధర్మాసనం గతంలో ఇచ్చిన తీర్పులను ద్విసభ్య ధర్మాసనం అభినందించింది.


