మహాత్మా గాంధీజీ ఆదర్శాలు చిరస్మరణీయం
భువనేశ్వర్: జాతిపిత మహాత్మాగాంధీ ఆదర్శాలు సదా చిరస్మరణీయమని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరి బాబు కంభంపాటి నివాళులర్పించారు. బాపూజీ వర్ధంతి సందర్భంగా ఆయన రాష్ట్ర శాసన సభ ప్రాంగణంలో గాంధీజీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. గవర్నర్‌తో శాసన సభ స్పీకర్ సురమా పాఢి, ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి, ఉపముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర విశిష్ట ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సత్యం, అహింస, దేశ సేవ అనే గాంధీజీ ఆదర్శాలకు పట్టం గట్టేందుకు నిబద్ధతతో కృషి చేస్తామని ప్రముఖులు సామూహిక సంకల్పాన్ని పునరుద్ఘాటించారు.
హాస్టల్ భోజనంలో పురుగులు
భువనేశ్వర్: స్థానిక బీజేబీ కళాశాల హాస్టల్‌లో విద్యార్థులకు పంపిణీ చేస్తున్న భోజనంలో పురుగులు తేలుతున్నాయి. ఈ పరిస్థితిపై విద్యార్థుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతుంది. హాస్టల్ సూపరింటెండెంట్ దృష్టికి ఈ విషయం తీసుకుని వెళ్లినా ప్రయోజనం శూన్యంగా పరిణమించిందని వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో భోజనంలో పురుగులు తేలుతున్న విషయమై కళాశాల ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేశారు.
రోడ్డు ప్రమాదంలో డ్రైవర్‌కు గాయాలు
భువనేశ్వర్: భువనేశ్వర్–ఖుర్ధా జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. టొమాండో ప్రాంతం గోహిరియా చౌరస్తా సమీపంలో కంటైనర్ ట్రక్కు తారు తీసుకెళ్తున్న ట్యాంకర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో డ్రైవర్ తీవ్రంగా గాయపడడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఉన్నత చికిత్స కోసం క్యాపిటల్ ఆస్పత్రికి తరలించారు. దట్టమైన పొగమంచు కారణంగా దృశ్యమాన్యత దిగజారడంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ సంఘటనతో రద్దీగా ఉండే జాతీయ రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తారు తీసుకెళ్తున్న ట్యాంకర్‌లో వస్తువులు జాతీయ రహదారిపై చెల్లాచెదురుగా తుల్లడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. టొమాండో పోలీసులు మరియు సహాయక బృందాలు సంఘటనా స్థలంలో ఈ పరిస్థితిని తొలగించి వాహనాల రవాణా పునరుద్ధరించారు. ప్రమాదానికి కచ్చితమైన కారణాన్ని తెలుసుకోవడానికి దర్యాప్తు జరుగుతోంది.
మార్చి 2 నుంచి
అగ్ని గంగమ్మ జాతర
రాయగడ: ఉత్కళాంధ్రుల ఆరాధ్య దైవంగా పూజలందుకుంటున్న కొరాపుట్ జిల్లా నీలావడిలో వెలసి ఉన్న అగ్ని గంగమ్మ అమ్మవారి జాతర మార్చి 2వ తేదీ నుంచి ప్రారంభమవ్వనుందని ఆలయ కమిటీ సభ్యులు ప్రకటించారు. తొమ్మిది రోజుల పాటుగా జరిగే ఈ జాతరను తిలకించేందుకు అటు ఆంధ్ర, ఇటు ఒడిశా రాష్ట్రాలకు చెందిన భక్తులు వేల సంఖ్యలో హాజరవుతారు. ప్రతీ ఏడాదిలా ఈసారి కూడా అమ్మవారి జాతరను ఘనంగా నిర్వహించేందుకు కమిటీ నిర్ణయించింది.
మహాత్మా గాంధీజీ ఆదర్శాలు చిరస్మరణీయం
మహాత్మా గాంధీజీ ఆదర్శాలు చిరస్మరణీయం


