దేవగిరి ఉత్సవాలకు సన్నాహక సమావేశం
రాయగడ: జిల్లాలోని కల్యాణ సింగుపూర్ సమితి ప్రముఖ శైవక్షేత్రం దేవగిరిలో ఈనెల 15వ తేదీన జరగనున్న మహా శివరాత్రి ఉత్సవాలకు సంబంధించి సన్నాహక సమావేశం సమితి కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. సర్పంచ్ గౌతమ్ బర్లి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అదనపు తహసీల్దార్ ఆనంద చరణ్ సబర్, డాక్టర్ అన్వభబ్ సాహు, సామాజిక కార్యకర్త సురేష్ కుమార్ మహంతి, పంచాయతీ అభివృద్ధి అధికారి శ్వేతాంబర్ ప్రధాన్, ఎస్‌ఐ దిలీప్ మాఝి తదితరులు హాజరయ్యారు. శివరాత్రి ఉత్సవాలు ప్రతీ ఏడాది దేవగిరి కొండపై భారీ ఎత్తున నిర్వహిస్తుంటారు. ఉత్సవాలను తిలకించేందుకు వేల సంఖ్యలో భక్తులు హాజరవుతారు. భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలకు సంబంధించి సమావేశంలో చర్చించారు. తాగునీటి సౌకర్యంతో భక్తులను అన్నదాన కార్యక్రమాలను నిర్వహించేందుకు నిర్ణయించారు. అదేవిధంగా భక్తులు దర్శనం చేసుకున్న సమయంలో భద్రతకు సంబంధించి ప్రత్యేక చర్యలు చేపట్టాలని అదనపు తహసీల్దార్ ఆనంద చరణ్ అన్నారు. ఈ ఏడాది భక్తులు భారీ సంఖ్యలో హాజరవుతారని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అదేవిధంగా అందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటుకు సమావేశంలో ప్రతిపాదించారు. త్వరలో కమిటీ వివరాలు వెల్లడిస్తామన్నారు.


