రాయగడలో కలరా..?
● నీటి నమూనాలను సేకరించిన వైద్య బృందం
● పాజిటివ్ కేసులు లేవని వెల్లడి
రాయగడ: పట్టణంలో కలరా వ్యాధి చాపకింద నీరులా వ్యాప్తి చెందినట్లు తెలుస్తోంది. స్థానిక కస్తూరీనగర్, ఇందిరానగర్, సీఆర్‌పీఎఫ్ క్యాంప్ సమీపంలోని పలు ప్రాంతాల్లో కలరా వ్యాపించినట్లు సమాచారం. కలరా వ్యాధి వ్యాపించిన వారు స్థానిక ఆస్పత్రికి చికిత్స కోసం వెళ్తున్నారు. అయితే రోగులకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు వైరల్ జ్వరాలుగా గుర్తిస్తున్నారు. అయితే కలరా వ్యాపించడంతో కొంతమంది వైద్యులను సంప్రదించకుండా నాటు వైద్యంపై ఆధారపడుతున్నట్లు తెలిసింది. కస్తూరీనగర్, ఇందిరానగర్ వంటి ప్రాంతాల్లో కలరా వ్యాధి 10 నుంచి 20 ఏళ్ల వయస్సుల్లో ఉన్నవారికి వ్యాపించినట్లు ఆయా ప్రాంతాలకు చెందినవారు చెబుతున్నారు. సమాచారం తెలుసుకున్న వైద్య బృందం సభ్యులు రుమా మహాపాత్రో, డాక్టర్ శ్రీనివాస్ సాహు, డాక్టర్ సంగ్రామ్ కేశరి నిమాల నేతృత్వంలొ సిబ్బంది ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. ఇంటింటా తిరిగి వివరాలు సేకరించారు. వారు తాగేందుకు వినియోగిస్తున్న నీటి నమూనాలను సేకరించారు. ఈ సందర్భంగా డీపీహెచ్‌వో మహాపాత్రో మాట్లాడుతూ నీటి నమూనాలను సేకరించడం పూర్తయ్యిందని, వాటిని ల్యాబ్‌కు పంపించి, పరీక్షలు నిర్వహించిన తర్వాత వచ్చే ఫలితాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే ఇప్పటివరకు ఎటువంటి కలరా వ్యాధికి సంబంధించి పాజిటివ్ కేసులు నమోదు కాలేదని స్పష్టం చేశారు. ఏది ఏమైనప్పటికీ కలరా వ్యాధి వ్యాపించడంతో ఆ ప్రాంత వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


