అనుమతి వచ్చాక రత్నసంపద లెక్కింపు
భువనేశ్వర్: పూరీ శ్రీమందిర్ రత్న భాండాగారంలో రత్నాలు, ఆభరణాల జాబితా లెక్కింపునకు సంబంధించి సవరించిన మార్గదర్శకాలను శ్రీమందిరం పాలక మండలి ఆమోదించింది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి పొందిన తర్వాత శుభ సమయంలో ఆభరణాల లెక్కింపు నిర్వహించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన తేదీని నిర్ణయించి రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసి ఆమోదం పొందిన తర్వాత వాస్తవ లెక్కింపు ప్రక్రియ ఆరంభం అవుతుందని ప్రధాన నిర్వాహకుడు డాక్టర్ అరవింద కుమార్ పాఢి తెలిపారు. ఆభరణాల జాబితా సమయంలో భక్తుల దర్శనంపై ఎలాంటి ప్రభావం ఉండదని, ఆ సమయంలో వెలుపలి గడప (బహారొ కఠొ) నుంచి దర్శన సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. గుండిచా ఆలయ విషయంపై కూడా పాలక మండలి సమావేశంలో చర్చించారు. ఇప్పట్లో గుండిచా ఆలయ నిర్వహణ వేలం వేసేది లేదని స్పష్టం చేశారు. శ్రీ మందిర్ పాలక మండలి సభ్యులు సందర్శించిన తర్వాత గుండిచా ఆలయం తెరుస్తారని, భక్తులకు ప్రవేశ రుసుము రూ. 10గా నిర్ధారించామని చెప్పారు. మొబైల్, చెప్పుల స్టాండ్‌లు ఉచితమని ప్రకటించారు. భక్త నివాస్‌లో రూ.500గా ఉన్న పార్కింగ్ ఫీజునురూ.240కి తగ్గించారు. సేవకులపై మొబైల్ ఫోన్ ఆంక్షలు విధించినట్లు తెలిపారు.


