సమ్మెను విజయవంతం చేయాలి
జయపురం: కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్ అవలంబిస్తున్న ప్రజా, కార్మిక విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12వ తేదీన తలపెట్టిన భారత సమ్మెను విజయవంతం కమ్యూనిస్టు పార్టీ నాయకులు కోరారు. ఈ మేరకు కొరాపుట్ జిల్లా కమ్యూనిస్టు పార్టీ విస్తృత సన్నాహాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో పార్టీ సీనియర్ నేత బుద్రా బొడనాయిక్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ముందుగా దివంగత నేత సోమనాథ్ పాత్రో మృతికి సంతాపంగా ఒక నిమిషం మౌనం పాటించారు. జిల్లా పార్టీ కార్యదర్శి రామకృష్ణ దా.. సమావేశ కారణాలను సభికులకు వివరించారు. అనంతరం రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు ప్రమోద్ కుమార్ మహంత మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వలన ఉత్పన్నమౌతున్న కార్మికులు, రైతులు, సాధారణ ప్రజల సమస్యల పరిష్కారం, నిరుద్యోగ సమస్య నివారణ, ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా దేశంలోని పది కేంద్ర కార్మిక సంఘాలు భారత సమ్మెకు పిలుపునిచ్చినట్టు పేర్కొన్నారు. జనవరి 24 నుంచి 31వ తేదీ వరకు నిధుల సేకరణ, ఫిబ్రవరి రెండు నుంచి ఏడో తేదీ వరకు టాటా పవర్ సంస్థ దౌర్యన్యాలు, కాలుష్యం పేరుతో సామాన్య ప్రజలపై సాగిస్తున్న వేధింపులు, విద్యుత్ చార్జిల పెంపుదలకు స్థానిక సమస్యలపై జిల్లాలోని వివిధ సమితిల్లో ప్రజాందోళనలు నిర్వహించి సర్వ భారత సమ్మెకు ప్రజలను సమాయత్తం చేయనునట్లు వెల్లడించారు. ప్రతి సమితిలో క్షేత్రస్థాయిలోను విస్తృతంగా సభ్యులను చేర్పించి కమ్యూనిస్టు పార్టీని, వామపక్ష ఉద్యమాన్ని బలోపేతం చేయాలని కమ్యూనిస్టు పార్టీ జిల్లా మాజీ కార్యదర్శి జుధిష్టర్ రౌళో, ఉత్కళ మహిళా సంఘ నాయకురాలు దయామణి నాయిక్ పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. సమావేశంలో సునీతబాగ్, కుమార్ జాని, బలభద్ర భోయి, పవన్ మహూరియ పాల్గొన్నారు.


