ఉత్కంఠగా హాకీ పోరు
హాకీ ఇండియా లీగ్ మ్యాచ్‌ను
తిలకించిన గవర్నర్
స్వాగతం పలికిన ప్రముఖులు
భువనేశ్వర్: స్థానిక కళింగ స్టేడియంలో జరిగిన హాకీ క్రీడాపోరు హోరాహోరీగా సాగింది. హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్ 2026) భువనేశ్వర్ దశ ప్రారంభ రోజు కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గవర్నర్‌కు రాష్ట్ర ఉన్నత విద్య, క్రీడలు, యువజన సేవలు, ఒడియా భాష, సాహిత్యం, సంస్కతి శాఖ మంత్రి సూర్యవంశీ సూరజ్ ఇతర ప్రముఖులతో కలిసి ఘనంగా స్వాగతం పలికారు. వేదాంత కళింగ లాన్సర్స్, ఢిల్లీ ఎస్‌జి పైపర్స్ జట్ల ఆటగాళ్లకు గవర్నరు శుభాకాంక్షలు తెలిపారు. క్రీడల పట్ల ఆటగాళ్లు చూపిస్తున్న అంకితభావాన్ని ఆయన ప్రశంసించారు. మంత్రితో కలిసి గవర్నర్ లీగ్ మ్యాచ్‌ను వీక్షించారు. రెండు జట్లు ప్రదర్శించిన పోటాపోటీ క్రీడాస్ఫూర్తి ఆయన్ను ఆకట్టుకుంది. వేదాంత కళింగ లాన్సర్స్ జట్టు విజయం సాధించింది. విదా ఎలక్ట్రిక్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం గవర్నర్ చేతుల మీదుగా అందుకున్నాడు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ఒడిశాలో హాకీకి ఒక ప్రత్యేక స్థానం ఉందన్నారు. హాకీ అభివృద్ధిలో రాష్ట్రం అందిస్తున్న నిరంతర మద్దతు ప్రశంసనీయమన్నారు. హాకీ ఇండియా లీగ్ వంటి కార్యక్రమాలు ప్రపంచ స్థాయి ప్రతిభను ప్రదర్శించి రాష్ట్ర వ్యాప్తంగా యువ క్రీడాకారులను ప్రోత్సహించడానికి ప్రేరేపిస్తాయన్నారు. కార్యక్రమంలో హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ కుమార్ టిర్కీ, హాకీ ఇండియా కోశాధికారి, తమిళనాడు హాకీ యూనిట్ అధ్యక్షుడు శేఖర్ జె.మనోహరన్, హాకీ ఇండియా డైరెక్టర్ జనరల్ కమాండర్ ఆర్.కె. శ్రీవాస్తవ, రాష్ట్ర క్రీడలు, యువజన సేవల శాఖ కమిషనర్ మరియు కార్యదర్శి సచిన్ రామచంద్ర జాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఉత్కంఠగా హాకీ పోరు
ఉత్కంఠగా హాకీ పోరు


