తిరుప్పావై ప్రవచనాలు ప్రారంభం
పర్లాకిమిడి: ధనుర్మాస వ్రత మహోత్సవాలు ప్రారంభం సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుప్పావై ప్రవచనాలు మంగళవారం సాయంత్రం నుంచి ప్రారంభమయ్యాయి. శ్రీవేంకటేశ్వర మందిరం కల్యాణ మండపంలో వీటిని ప్రారంభించారు. ముప్పై రోజుల పాటు సాగే ఈ తిరుప్పావై ప్రవచనాలు భోగి పండుగ నాడు గోదా కల్యాణంతో ముగుస్తాయి. రోజూ సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకూ ఈ ప్రవచనాలు చెబుతారు. ఆలయ ప్రధాన అర్చకులు భధ్రం శ్రీనివాసా చార్యులు ఈ ఆళ్వార్ దివ్య ప్రబంధాలలో తొలిరోజు రెండు పాశురాలు భక్తులకు తెలియజేశారు.
వృద్ధునికి గాయాలు
రాయగడ: చలి వేస్తుండడంతో వెచ్చగా ఉంటుందని మంచం కింద కుంపటి పెట్టుకొని నిద్రిస్తుండగా మంటలు వ్యాపించడంతో మంచంపై పడుకున్న వృద్ధుడు మంటల్లో చిక్కుకొని తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన జిల్లాలోని కళ్యాణసింగుపూర్ సమితి పరిధి కొత్తగుడ గ్రామంలో చోటు చేసుకుంది. గాయాలు పాలైన మంగేతన్ గరడియాను వెంటనే కుటుంబీకులు అంబులెన్స్‌లో ఆస్పత్రిలో చేర్పించారు. వృద్ధుడు గరడియా సోమవారం రాత్రి భోజనాలు చేసిన అనంతరం కుంపట్లో కట్టెలు వేసి మంట పెట్టుకున్నాడు. అనంతరం నిప్పుగా అవి మారడంతో కుంపటిని తాళ్ల మంచం కిందపెట్టి నిద్రించాడు. కొద్ది సమయం తరువాత తాళ్లు కాలిపోయి మంచానికి మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో గాఢనిద్రలో ఉన్న వృద్ధుడు మంటల్లో చిక్కుకుని గాయాలు పాలయ్యాడు. ఇళ్లంతా పొగ కమ్ముకోవడంతొ అంతాలేచి చూసేసరికి గరడియా మంటల్లో చిక్కుకోవడం గమనించిన కుటుంబీకులు మంటలను ఆర్పి వెంటనే ఆంబులెన్స్‌కు సమాచారం అందించారు.
గుర్తు తెలియని
మృతదేహం లభ్యం
రాయగడ: జిల్లాలోని చందిలి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొత్తపేట పంచాయతీ వీర నారాయణపూర్ గ్రామ సమీపంలని పొలంలో గుర్తు తెలియని వృద్ధుని మృతదేహం లభించింది. అటువైపుగా వెళుతున్న కొందరు మృతదేహాన్ని చూసి చందిలి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుని వయసు 70 ఏళ్లకు పైబడి ఉంటుందని, శరీరంపై నీలపురంగు చొక్కా, లుంగీ ఉన్నట్టు చెప్పారు. గుర్తించినవారు సమాచారం ఇవ్వాలని సూచించారు.
తిరుప్పావై ప్రవచనాలు ప్రారంభం


