లోకానికి అలంకారం.. బతుకుల్లో అంధకారం..! | - | Sakshi
Sakshi News home page

లోకానికి అలంకారం.. బతుకుల్లో అంధకారం..!

Mar 10 2026 7:15 AM | Updated on Mar 10 2026 7:15 AM

స్వర్ణకారులకు పని కరువు

రెడిమేడ్‌.. వన్‌గ్రామ్‌ గోల్డ్‌తో డీలా

బంగారం ధర పెరగడంతో మరిన్ని ఇబ్బందులు

పనిలేక పస్తులతో గడుపుతున్న

కులవృత్తిదారులు

దయనీయ పరిస్థితులు

ప్రస్తుతం మేము దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. కనీస స్థాయిలో కూడా పనులు లేవు. బంగారం ధర పెరుగుదలతో ఆభరణాలు తయారు చేయించేవారి సంఖ్య తక్కువైంది. ఆపై వన్‌గ్రామ్‌ గోల్డ్‌, రెడీమేడ్‌ ఆభరణాల వైపే అందరూ చూస్తున్నారు. తమలాంటి వారికి ఉపాధి లేకుండా పోయింది. రోజువారి జీవనానికి కూడా ఇబ్బందులు పడుతున్నాం. – ఎం.రవి, కామాక్షి స్వర్ణకార సంఘం అధ్యక్షుడు, హిరమండలం

కార్పొరేట్‌తో విలవిల

ప్రస్తుతం అంతా రెడిమేడ్‌ ఆభరణాలు రావడంతో స్వర్ణకారులతో ఆభరణాలు తయారు చేయించుకోవడం తగ్గిపోయింది. ఆపై కార్పొరేట్‌ వ్యాపారం పెరిగి పోయింది. తరుగు, డిస్కౌంట్‌ అంటూ కార్పొరేట్‌ వ్యాపారులు ఆఫర్లు ప్రకటిస్తున్నారు. దీంతో ప్రజలు అటువైపు మొగ్గుచూపుతున్నారు. ఆపై పెరిగిన బంగారం ధరల పుణ్యమా అని రోల్డ్‌గోల్డ్‌ ఆభరణాలను ఎక్కువ మంది ఆశ్రయిస్తున్నారు. దీంతో కులవృత్తిపై ఆధారపడే స్వర్ణకారులకు ఉపాధి తగ్గుతోంది. గతంలో సంక్రాంతి వంటి పండగ సమయాల్లో వారికి ఖాళీ ఉండేది కాదు. వివాహాల సీజన్‌లో అయితే క్షణం తీరిక దొరకదు. అటువంటిది ఈ సంవత్సరం షాపుల వైపు చూసేవారు లేకపోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఆభరణాలకు మెరుగుపెడితే వందో.. రెండొందలో వస్తుందనుకుంటే, ఎవరూ ఈ వైపు రావడమే మానేశారని చెబుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

హిరమండలం:

సిడికి ప్రాణం పోస్తూ.. అందమైన ఆభరణాలతో లోకాన్ని మురిపించే స్వర్ణకారుల బతుకుల్లో చీకట్లు అలముకుంటున్నాయి. కంటికి ఇంపుగా కనిపించే నగలను తయారు చేసే చేతులకు నేడు పని దొరకడం గగనమైపోతోంది. ప్రస్తు తం బంగారం పరుగులు పెడుతోంది. వెండి రోజురోజుకూ ఎగబాకుతోంది. దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు వాటిని కొనుగోలు చేసేందుకు బెంబేలెత్తిపోతున్నారు. ఉన్నత వర్గాల వారు రెడీమేడ్‌ బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తున్నారు. దీంతో స్వర్ణకారులకు పని లేకుండా పోతోంది. జిల్లాలో ఏ స్వర్ణకారుడిని అడిగినా పనులు లేవని చెబుతున్నారు. ఇప్పటికే రోల్డ్‌గోల్డ్‌, రెడీమేడ్‌ ఆభరణాలతో వారికి పనులు లేకుండా పోయాయి. ఇప్పుడు పెరిగిన బంగారం ధరలతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు వాటి జోలికి పోవడం లేదు. దీంతో బంగారం పనులు చేసే స్వర్ణకారుల జీవనం దయనీయంగా మారింది.

ఇదీ పరిస్థితి..

జిల్లాలో నరసన్నపేట బంగారం మార్కెట్‌కు పెట్టింది పేరు. ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాల నుంచి ప్రజ లు ఇక్కడికి వచ్చి బంగారు ఆభరణాలు తయారు చేయించుకుంటారు. శ్రీకాకుళం నగరంలో సైతం బంగారం దుకాణాలు అధికం. పలాస–కాశీబుగ్గ, టెక్కలి, పాతపట్నం, సోంపేట, ఇచ్ఛాపురంతో పాటు అన్ని మండల కేంద్రాలు, పట్టణాల్లో బంగారం దుకాణాలు జిల్లాలో 200 వరకు ఉంటాయి. ప్రతీ దుకాణానికి అనుసంధానంగా కొందరు స్వర్ణ కారులు ఉంటారు. దుకాణాల్లో బంగారం కొనుగోలు చేసే సమయంలో నమ్మకస్తులైన కొందరు స్వర్ణకారులకు పనులు అప్పగిస్తుంటారు షాపు యజమానులు. బంగారం, వెండి, ప్లాటినం వంటి లోహాలను ఉపయోగించి ఆభరణాలు, ఇతర అలంకరణ వస్తువులు తయారు చేస్తుంటారు. జిల్లాలో ఇటువంటివారు 800 మంది వరకూ ఉంటారని ఒక అంచనా. బక బంగారు ఆభరణం తయారు చేయాలన్నా.. మరమ్మతులు చేసి మెరుగుపరచాలన్నా నిశిత దృష్టి అవసరం. సాధారణంగా ఆ వృత్తే కష్టం. అటువంటిది ఇప్పుడు ఆ పని కూడా లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement