రాయగడ: జిల్లాలోని మునిగుడలో గల సమితి కార్యాలయం సమావేశం హాల్‌లో సోమవారం జిల్లా కలెక్టర్ అశుతోస్ కులకర్ణి ఆధ్వర్యంలో జరిగిన వినతుల స్వీకరణ కార్యక్రమంలో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ, తమ సమస్యలను దృష్టికి తీసుకువెళ్లారు. సమితిలో గల వివిధ ప్రాంతాల నుంచి వచ్చినవారు 73 సమస్యలను విన్నవించుకున్నారు. ఇందులో 57 వ్యక్తిగత సమస్యలుగా కలెక్టర్ గుర్తించగా మిగతా 16 గ్రామ సమస్యలుగా పరిగణలోకి తీసుకున్నారు. రెడ్ క్రాస్ నిధుల నుంచి ఒకరికి రూ.20 వేల చొప్పున ముగ్గురుకి రూ.60 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. మరో ఇద్దరికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.40 వేల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. స్వీకరించిన గ్రామ సమస్యలను సంబంధిత శాఖ అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్‌ఒ సచీన్ అన్నా సాహెబ్ అహోలే, జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహక అధి కారి అక్షయకుమార్ ఖెముండొ, గుణుపూర్ ఐటీడీ ఏ ప్రాజెక్టు అధికారి అజయ్ కుమార్ ప్రధాన్, ఇతర జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.


