సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తికి ప్రతిబింబం
భువనేశ్వర్: గుజరాత్‌లోని నర్మదా జిల్లా ఏక్‌తా నగర్ (కెవాడియా)లోని ఐక్యతా విగ్రహం సమీపంలో జరిగిన భారత్ పర్వ్–2025 వేడుకలో ప్రసంగిస్తూ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరి బాబు కంభంపాటి భారత దేశం అంతటా ఉన్న ప్రజలు ఒడిశాను సందర్శించాలని ఆహ్వానించారు. ఒడిశా సంస్కృతి, కళలు, ఆధ్యాత్మికతకు ప్రసిద్ధి చెందిన భూమిగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతూ భారత్ పర్వ్ ఏకత్వంలో భిన్నత్వంతో దేశాన్ని ఏకం చేసే వేడుకగా వెలుగొందుతుందన్నారు. ఐక్యత విగ్రహం సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందన్నారు.
భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ ఏటా నిర్వహించే వార్షిక జాతీయ ఉత్సవం భారత్ పర్వ్. ఇది ఏక్ భారత్, శ్రేష్ట భారత్ స్ఫూర్తిని రంగరించుకుంది. ఈ కార్యక్రమం వివిధ రాష్ట్రాల నుంచి ప్రదర్శనలు, వంటకాలు, హస్తకళలు, సంగీతం, నృత్య ప్రదర్శనల ద్వారా భారత దేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రదర్శిస్తుంది. భారత దేశ సంప్రదాయాల ఐక్యత, గొప్పతనాన్ని ఒకే చోట అనుభవించడానికి ఇది ఒక వేదికగా ఆకట్టుకుంటుంది.
ఒడిశా చరిత్ర, వారసత్వం, ప్రకృతి సౌందర్యం అందంగా కలిసిపోయే రాష్ట్రం అని గవర్నర్ అన్నారు. స్వర్ణ త్రిభుజాన్ని ఏర్పరిచే ప్రసిద్ధ భువనేశ్వర్, పూరీ, కోణార్క్ దేవాలయాలు, చాందీ పూర్, గోపాల్ పూర్ యొక్క ప్రశాంతమైన బీచ్‌లు, సిమిలిపాల్, కొరాపుట్ పచ్చని అడవులు, సుందరమైన చిలికా సరసు, మయూరభంజ్ యొక్క గొప్ప గిరిజన సంస్కృతి గురించి ఆయన మాట్లాడారు. ఒడిశాలో అడుగుడుగున భక్తి, సృజనాత్మకత తారసపడుతుందన్నారు.
ఈ కార్యక్రమం పురస్కరించుకుని భారత దేశం యొక్క భిన్నత్వంలో ఏకత్వాన్ని సూచించే స్టాట్యూ ఆఫ్ యూనిటీ కింద నిలబడటం గర్వకారణమైన క్షణం అని అన్నారు. భారత్ పర్వ్‌లో పాల్గొనే ముందు గవర్నర్ సర్దార్ సరోవర్ ఆనకట్టను సందర్శించారు. ఇది భారత దేశం యొక్క దార్శనికత, పురోగతికి చిహ్నంగా గవర్నర్ పేర్కొన్నారు. గవర్నర్‌తో ఒడిశా శాసన సభ స్పీకర్ సురమా పాఢి, రాష్ట్ర ఒడియా భాష, సాహిత్యం మరియు సంస్కృతి విభాగం మంత్రి సూర్య వంశీ సూరజ్ పాల్గొన్నారు.
సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తికి ప్రతిబింబం


