● పెరుగుతున్న చలి
భువనేశ్వర్: రాష్ట్రంలో చలి గాలులు పుంజుకుంటున్నాయి. క్రమంగా ఉష్ణోగ్రతలో తగ్గుదల కనిపిస్తోంది. ఉత్తర ఒడిశా మారు మూల ప్రాంతాల్లో రాత్రి పూట ఉష్ణోగ్రత ఊహాతీతంగా దిగజారిందని స్థానిక వాతావరణ కేంద్రం సమాచారం. రాష్ట్రంలో అత్యధిక ప్రాంతాల్లో చలి పెరిగింది. వాతావరణంలో పొడి గాలి ప్రభావం పెరగడంతో చాలా చోట్ల ఉష్ణోగ్రత దిగజారింది. కళింగ కాశ్మీరుగా పేరొందిన దారింగ్‌బాడిలో ఉష్ణోగ్రత 11 డిగ్రీలకు దిగజారింది. ఝార్సుగుడ, ఫుల్బణి, కొరాపుట్, సుందర్‌గఢ్, కెంజొహర్ వంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 15 డిగ్రీలకు పరిమితమైంది. రాగల 2 నుంచి 3 రోజుల్లో ఉష్ణోగ్రత మరింత తగ్గి చలి పెరుగుతుందని భారత వాతావరణ శాఖ సమాచారం. ఈ నెల 14వ తేదీ నాటికి రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత దాదాపు 10 డిగ్రీలు తగ్గుతుందని సమాచారం. కటక్, భువనేశ్వర్ జంట నగరాల్లో ఉష్ణోగ్రత 15 డిగ్రీల కంటే తగ్గవచ్చు. ఝార్సుగుడలో ఉష్ణోగ్రత గణనీయంగా 11.7 డిగ్రీలకు పడిపోయింది. ఇది సాధారణం కంటే 6.2 డిగ్రీలు తక్కువ. అంగుల్, భద్రక్ ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 15 డిగ్రీల కంటే తగ్గింది. సుందర్‌గఢ్ జిల్లా కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి తేలికపాటి పొగ మంచు కమ్మింది. కలహండి జిల్లాలో ఒకటి, రెండు చోట్ల దట్టమైన పొగమంచు అలముకుంది. ఉత్తర ఒడిశా మారు మూల జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రత 6 డిగ్రీల వరకు తగ్గింది. ఉత్తర తీర ప్రాంత ఒడిశాలో 2 నుంచి 3 డిగ్రీల వరకు తగ్గింది. ఇది మరింత తగ్గే అవకాశం ఉంది. ఆదివారం రాత్రి రాష్ట్రంలోని 10 నగరాల్లో కనిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీల కంటే తక్కువగా నమోదైంది. దారింగ్‌బాడిలో 11 డిగ్రీల సెల్సియస్, ఝార్సుగుడలో 11.7, ఫుల్బణిలో 12, రౌర్కెలాలో 13.2, భద్రక్‌లో 14, సుందర్‌గఢ్‌లో 14, కొరాపుట్, అంగుల్ మరియు కెంజొహర్ ప్రాంతాల్లో 14.2, భవానీపట్నలో 14.6, భువనేశ్వర్‌లో 17.4 డిగ్రీల ఉష్ణోగ్రతతో తేలికపాటి చలి ప్రారంభమైంది. రానున్న 24 గంటల్లో రాజధాని భువనేశ్వర్, పరిసర ప్రాంతాల్లో రాత్రి పూట ఉష్ణోగ్రత సుమారు 17 డిగ్రీలకు పరిమితం అవుతుంది. ఉదయం పూట తేలికపాటి పొగమంచు వాతావరణం ఉంటుంది. పగటిపూట ఆకాశం నిర్మలంగా ఉంటూ ఉష్ణోగ్రత 31 డిగ్రీల మధ్య ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది.


